హీరోయిన్ గా మారుతున్న ఫేమస్ సింగర్..!
సినిమా ఇండస్ట్రీ అంటేనే అదృష్టాన్ని పరీక్షించుకోవడం. చాలా మందికి ఇండస్ట్రీలో ముందుకి వెళ్లాలంటే టాలెంట్ తో పాటు కాస్తంత లక్ కూడా కలిసి రావాలని అందరికి తెలిసిన విషయమే. ఈ కోవలోకే వస్తుంది సింగర్ మంగ్లీ. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఈ చిన్నది, చిన్న షో తో యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్ స్థాయికి చేరుకుంది. తెలంగాణ యాసలో పాట పాడుతూ పాపులర్ అయిన మంగ్లీ అనతి కాలంలోనే సినిమా సింగర్ గా పాపులర్ అయింది.
నాగచైతన్య నటించిన “శైలజా రెడ్డి అల్లుడు” సినిమాతో సినీ నేపథ్య గాయనిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది మంగ్లీ. పెక్యూలర్ వాయిస్ తో అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకుంది. తను గొంతు విప్పిందంటే ఆ పాట సూపర్ హిట్టే అనేంతగా టాలీవుడ్, శాండల్ వుడ్ లలో మంచి పేరు తెచ్చుకుంది. మంగ్లీ త్వరలోనే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు వరుస కథనాలు వినిపిస్తున్నాయి. కన్నడ సినిమాతో మంగ్లీ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కన్నడ దర్శకుడు చక్రవర్తి చంద్రచూడ్ దర్వకత్వం వహిస్తున్న సినిమా “పాదరాయ”. ఈ సినిమాలో మంగ్లీ హీరోయిన్ గా నటించనుందని చెబుతున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో మంగ్లీ పాన్ ఇండియా హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. 2013-14 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో మంగ్లీకి జోడిగా నాగశేఖర్ హీరోగా నటిస్తుండగా రెగ్యులర్ షూటింగ్ ని త్వరలోనే ప్రారంభించనున్నట్టుగా సమాచారం అందుతుంది.













