ఘనంగా మనం సైతం ఐదవ వార్షికోత్సవం
అందరూ ఆస్తులు సంపాదించుకుంటే కాదంబరి కిరణ్ మాత్రం పదిమంది అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు. సేవా మార్గాన్ని అనుసరిస్తూ అనేక మందికి సాయపడుతున్నాడు అని అన్నారు హాస్యనటుడు అలీ. నటుడు కాదంబరి కిరణ్ జన్మదినంతో పాటు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న మనం సైతం సేవా సంస్థ ఐదవ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో ఆలీ, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ ఒక్కడిగా ఎదుగుతూ పైకొచ్చాడు. నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా అందరి ఆదరణ చూరగొన్నాడు అని తెలిపారు. మనం సైతం ద్వారా కాదంబరి కిరణ్ మంచి కార్యక్రమాల్ని చేస్తున్నాడని, ఈ సంస్థకు వ్యక్తిగతంగా తాను ఆర్థిక సాయం చేస్తానని పృథ్వీ తెలిపారు. కాదబరి కిరణ్ మాట్లాడుతూ సేవ చేసే మనసున్న వారే నా దృష్టిలో గొప్పోళ్లు. ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యాన్ని దాచిపెట్టి మరణించిన వారిని చాలా మందిని చూశారు. పేదవారికి జనతా ఆసుపత్రి, వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాల ఒకే ప్రాంగణంలో నిర్మించాలన్నది నా జీవితాశయం. నేను ఉన్నా లేకపోయినా మనం సైతం మాత్రం ఇలాగే కొనసాగుతుందని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్తిక్‌రెడ్డి, అజయ్‌కుమార్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.













