‘సర్కారువారి పాట’ శంకర్ సినిమా తరహాలో ఉంటుందా?

అవినీతి, లంచగొండితనం, బాధ్యతారాహిత్యం.. ఇలాంటి పదాలన్నీ సాధారణంగా శంకర్ సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. జెంటిల్‌మేన్, భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు.. ఈ సినిమాలన్నీ అలాంటి కథాంశంతో రూపొందించినవే. ఈ తరహా కథలతో ఎవరైనా సినిమా చేసినా అది శంకర్ సినిమాలా ఉందనో, శంకర్‌లా తీశాడనో అంటారు. ఇప్పుడు అదే తరహా కథతో వస్తున్నాడు దర్శకుడు పరశురామ్. మహేష్ కాంబినేషన్‌లో `సర్కారువారి పాట` పేరుతో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన వెలువడింది. `గీతగోవిందం` వంటి ఎమోషనల్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన పరశురామ్ ఆ సినిమాకి పూర్తి విరుద్ధమైన కథాంశంతో రాబోతున్నాడు. సమాజంలో జరుగుతున్న అవినీతి ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఇలాంటి కుంభకోణంలో ముందు చెప్పుకోవాల్సింది విజయ్ మాల్యా గురించి. `సర్కారువారి పాట` చిత్రంలో అలాంటి ఓ క్యారెక్టర్‌ని క్రియేట్ చేశాడు పరశురామ్. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు. వేలాది కోట్ల రూపాయలు ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు అనేది ముఖ్య కథాంశం.
ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుండగా, విజయ్‌మాల్యా తరహా పాత్రను అరవింద్ స్వామి పోషించే అవకాశం ఉంది. మొదట ఈ పాత్ర కోసం సుదీప్, ఉపేంద్ర పేర్లు వినిపించాయి. కానీ, ఆ క్యారెక్టర్ ఎంతో రిచ్‌గా ఉంటుంది కాబట్టి అరవింద్‌స్వామి అయితే పర్‌ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా ఎక్కువగా బ్యాంక్ నేపథ్యంలోనే ఉంటుంది కాబట్టి దాని కోసం ఒక బ్యాంక్ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. షూటింగులకు అనుమతి వచ్చినప్పటికీ మహేష్ మాత్రం డిసెంబర్ వరకు షూటింగ్ చేయనని చెప్పేశాడట. అందుకే షూటింగ్‌ను కూడా పోస్ట్‌పోన్ చేసుకున్నారు. డిసెంబర్‌లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. శంకర్ చిత్రాల్లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా సోషల్ మెసేజ్‌తోపాటు మంచి లవ్‌స్టోరీ, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పాటలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు పరశురామ్. థమన్ సంగీత సారధ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. థమన్ కాంబినేషన్‌లో మహేష్‌కి గతంలో మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిని మించే రేంజ్‌లో థమన్‌తో మ్యూజిక్ చేయించుకునేందుకు పరశురామ్ బాగా కృషి చేస్తున్నాడట.