Madhavan: ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడం సవాల్ గా మారింది
నటుడిగా, హీరోగా, విలన్ గా పలు పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పించిన మాధవన్(Madhavan) నటించిన టెస్ట్(Test) మూవీ ఇటీవలే నెట్ఫ్లిక్స్ లో రిలీజై స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా టెస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా ఫిల్మ్ మేకింగ్ ఎంత కష్టంగా మారిందో, ప్రేక్షకుల్ని మెప్పించగలగడం డైరెక్టర్ కు ఈ రోజుల్లో ఎంత పెద్ద సవాలుగా మారిందో ఆయన వెల్లడించారు.
ఒకప్పుడు తాను సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవని, థియేటర్ దగ్గరకు వెళ్లి అక్కడి జనాల్ని తోసుకుంటూ పార్కింగ్ చేసి, ఓ వైపు క్యూ లో నిలబడి టికెట్స్ కొనుక్కోవాల్సి వచ్చేదని, ఆ రోజుల్లో ఇంటర్వెల్ లో తినడానికి పాప్ కార్న్, సమోసా తప్ప ఏం ఉండేవి కాదని, అన్ని పరిస్థితుల్లో సినిమా చూసి బయటికొచ్చాక ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉండేదని, కానీ ఇప్పుడు మారుతున్న జెనరేషన్ లో భాగంగా అన్నీ మారిపోయాయని మాధవన్ అన్నారు.
థియేటర్లో మన సీటు దగ్గరకే ఏం కావాలో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చేసిందని, పాప్ కార్న్ నుంచి పానీ పూరీ వరకు అన్నీ అందుబాటులోకి వచ్చాయని, ఆడియన్స్ సినిమా చూసే తీరు మారిందని, సినిమా చూసేకంటే ఫ్లాష్ లైట్స్ చూడటం ఎక్కువైపోయిందని, ఈ లోపు సినిమాలో ఏదైనా బోరింగ్ సీన్ వస్తే మనీ వేస్ట్ అనుకోవడం, క్లైమాక్స్ ముందు నుంచే పార్కింగ్ నుంచి బయటికెళ్లాలని కొంతమంది అడ్డుగా రావడం లాంటి సినిమాపై ప్రభావం చూపుతున్నాయని, ఇన్ని అంశాల మధ్య సినిమా నచ్చకపోతే ఆడియన్స్ అసలు సహించడం లేదని మాధవన్ తెలిపారు.













