జాతి రత్నాలను టచ్ చేయడం అసాధ్యమే
మొన్న వారం టాలీవుడ్ లో చాలా సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే. రిలీజైన ఏడెనిమిది సినిమాల్లో మ్యాడ్ అనే ఒక్క సినిమాకే మౌత్ ఆఫ్ వర్డ్ బాగుంది. మిగిలిన వాటిలో చిన్నా అనే మూవీకి మంచి రివ్యూస్ వస్తున్నాయి కానీ జనాలు మాత్రం థియేటర్ల దగ్గర కనిపించడం లేదు. దీంతో ఈ వారం విజేత మ్యాడ్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ నాగవంశీ ఆడియన్స్ ను నవ్వు రాకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని హామీ ఇచ్చాడు. దాంతో పాటూ ఈ మూవీలో జాతిరత్నాలు మూవీకి మించిన ఫన్ ఉంటుందని నొక్కి మరీ చెప్పాడు. ఆయన చెప్పినట్లే సినిమాలో మంచి కామెడీ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటారు కానీ జాతి రత్నాలు మూవీని మించేలా ఈ మూవీ ఉంటుందనడం మాత్రం మాటలానే మిగిలిపోయేలా కనిపిస్తుంది.
మ్యాడ్ మూవీ మొదటి వీకెండ్ బాగా పెర్పార్మ్ చేసినప్పటికీ సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయినట్లు కనిపిస్తోంది. కానీ జాతిరత్నాలుకు వరుసగా పది రోజుల వరకు మెయిన్ థియేటర్లన్నీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఫైనల్ రన్ అయ్యేలోపు ఏకంగా 30 కోట్లు సాధించి అమ్మో అనిపించింది. కానీ మ్యాడ్ సినిమాకు ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేలా కనిపించడం లేదు.
ఈ సినిమాలో ఉన్న కామెడీ కేవలం యూత్కే అర్థమయ్యేలా ఉండటంతో సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోతున్నారు. కానీ జాతి రత్నాలు మూవీ అలా కాదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆ సినిమాను ఓన్ చేసుకున్నారు. కామెడీని ఎంజాయ్ చేయగలిగారు. కాబట్టి ఎలా చూసుకున్నా మ్యాడ్ మూవీ, జాతి రత్నాలును టచ్ చేయడమనేది జరగని పని. మరి దీన్ని నాగ వంశీ తర్వాత ఎలా సమర్థించుకుంటారో చూడాలి.













