ఏజెంట్ కోసం ఇంకెన్నాళ్లు ఆగాలి?
అక్కినేని అఖిల్ ఎంతో కష్టపడి చేసిన ఏజెంట్ సినిమా టాలీవుడ్ లోని అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎంతటి డిజాస్టర్ అయినా సరే ఏజెంట్ ను థియేటర్లలో చూడని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. సినిమా ఎలా ఉన్నా సరే ఓటీటీ లేదా టీవీలో చూద్దామని వెయిట్ చేస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఏజెంట్ సినిమా రిలీజై ఏడాది దాటుతున్నా ఇప్పటివరకు ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ లోకి అందుబాటులో రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను హక్కులు సొంతం చేసుకున్న టీవీ ఛానెల్ ఈ నెల 28న ప్రసారం చేయబోతున్నట్లు తెగ పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది చూసి అఖిల్ ఫ్యాన్స్ డబ్బింగ్ తప్ప ఒరిజినల్ చూసే భాగ్యం తమకి లేదా అని బాధపడుతున్నారు.
వాస్తవానికి ఏజెంట్ తెలుగు ఓటీటీ రైట్స్ ను సోనీ లివ్ కు ఇచ్చారు. అగ్రిమెంట్ కూడా అయింది. కానీ బయట డిస్ట్రిబ్యూటర్ తో ఏదో ఫైనాన్స్ వివాదం వల్ల అది బ్రేక్ పడింది. ఆ కేసు తర్వాత కూడా ముందుకు జరిగినట్లు కనిపించడం లేదు. పోనీ టీవీలో చూద్దామంటే ఆ అదృష్టం కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. భారీ పాన్ ఇండియా సినిమాలే రిలీజైన 50 రోజుల్లోపు ఓటీటీలోకి వస్తున్న రోజుల్లో రిలీజై ఏడాది దాటినా ఏజెంట్ ఇప్పటికీ ఓటీటీలోకి రాకపోవడం విచిత్రమే.













