HHVM: ‘హరి హర వీరమల్లు’ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 21(సోమవారం) సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “లక్షలాది అభిమానుల మధ్య ఈ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. వర్షాలు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువమందితో నిర్వహిస్తున్నాము. అభిమానుల క్షేమం గురించి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేడుకకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ గారికి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాల్లోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో, అలాగే రాజకీయాల్లోకి వచ్చి ఈశ్వర్ ఖండ్రే గారి లాంటి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన ఇక్కడికి వచ్చినందుకు కృతఙ్ఞతలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన కందుల దుర్గేష్ గారు, రఘురామకృష్ణ రాజు గారికి కూడా నా ధన్యవాదాలు. రెండు సంవత్సరాల క్రితం ‘భీమ్లా నాయక్’ విడుదలైనప్పుడు.. అన్ని సినిమాలకు వందల్లో ఉంటే, ఆ సినిమాకి 10, 20 రూపాయలు టికెట్ రేట్లు చేశారు. నేను అప్పుడు ఒక మాట చెప్పను ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని. ఇది డబ్బు గురించి కాదు, రికార్డుల గురించి కాదు. మనం ధైర్యంగా నిలబడితే న్యాయం జరిగి తీరుతుంది.
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. నేను అసలు నటుడు అవ్వాలని కూడా కోరుకోలేదు. సగటు మనిషిగా బ్రతకాలన్న ఆలోచన తప్ప ఏంలేదు. నన్ను ఇంతటి వాడిని చేసింది అభిమానులే. పడినా, లేచినా, ఎలా ఉన్నా.. అన్నా నీ వెంట మేమున్నాం అన్నారు. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో ఉండే అభిమానులు తప్ప ఎవరూ లేరు. నేను సినీ పరిశ్రమకు వచ్చి 29 ఏళ్ళు. కొంచెం వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చావ ఇంకా బ్రతికే ఉంది. వరుస హిట్స్ ఇచ్చిన నేను.. జానీతో పరాజయం చూశాను. ఆ సమయంలో అర్థమైంది.. ఇక్కడ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని. కానీ నేను ఒకటే నమ్మాను.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేదు, నన్ను ప్రేమించే నా అభిమానులు ఉన్నారని. చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. పేరుంది, ప్రధాన మంత్రి గారి దగ్గర నుంచి అందరూ తెలుసు. కానీ, దాని వల్ల డబ్బులు రావు. సినిమా చేసే డబ్బులు సంపాదించాలి. నాతో ఖుషి సినిమా తీసిన రత్నం గారు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. నేను పరాజయాల్లో ఉన్నప్పుడు నా పక్కన నిలబడింది త్రివిక్రమ్ గారు. అపజయాల్లో ఉన్న నన్ను వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, నా ఆత్మ బంధువు త్రివిక్రమ్.. అప్పుడు నాతో జల్సా సినిమా తీశారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. నాకు అలాంటి స్నేహితుడు త్రివిక్రమ్ గారు.
నేను రీమేక్ సినిమాలు చేయడం మీకు నచ్చకపోవచ్చు. కానీ, నా కుటుంబాన్ని పోషించడానికి, పార్టీని నడపడానికి తక్కువ సమయంలో డబ్బులు కావాలంటే రీమేక్ సినిమాలు చేయక తప్పలేదు. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా చేయాలనుకుంటే.. అది ఎ.ఎం. రత్నం గారి ద్వారా వచ్చింది. మొదట రత్నం గారు కూడా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ, క్రిష్ గారు ఈ కథ చెప్పారు. ఈ సినిమాకి పునాది వేసింది ఆయనే. నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రుతలూగించి ఆస్కార్ గెలిచారు కీరవాణి గారు. కరోనా వంటి కారణాల సినిమా ఆలస్యమవ్వడంతో నిరుత్సాహం వచ్చేది. కానీ, కీరవాణి గారి సంగీతం విన్న వెంటనే మళ్ళీ ఉత్సాహం కలిగేది. కీరవాణి గారి సంగీతం లేకుండా హరి హర వీరమల్లు లేదు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉండి కూడా.. అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆయన ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశారు. తండ్రికి ఉన్న విజన్ కి కొడుకు సారధ్యం వహించారు. తండ్రీకొడుకుల ఎఫర్ట్ ఈ సినిమా. రత్నం గారికి, జ్యోతికృష్ణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
నేను మంత్రి అయిన తర్వాత.. పాలనా సమయానికి ఇబ్బంది కలగకుండా, నా వ్యక్తిగత సమయాన్ని ప్రతి రోజూ రెండు గంటలు కేటాయించాను. అందుకు తగ్గట్టుగా జ్యోతికృష్ణ, పరమహంస గారు షూట్ ని ప్లాన్ చేసి.. అద్భుతమైన అవుట్ పుట్ తీసుకొచ్చారు. ఈ సినిమాని ఒంటి చేత్తో నెల రోజులుగా ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ గారికి అభినందనలు. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ అద్భుతంగా నటించారు. హరి హర వీరమల్లు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. మన భారతదేశం ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరినీ ఆక్రమించుకోలేదు. మనం చదువుకున్న పుస్తకాల్లో మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. వారి అరాచకాన్ని చెప్పలేదు. ఔరంగజేబు సమయంలో నువ్వు హిందువుగా బ్రతకాలంటే టాక్స్ కట్టాలి అన్నారు. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ ప్రజల పక్షాన నిలబడ్డారు.
ఇలాంటి నేపథ్యంలో వీరమల్లు అనే కల్పిత పాత్రతో ఒక సగటు మనిషి ఏం చేసి ఉండొచ్చు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం ఎన్నో చేతులు మారుతూ ఇప్పుడు లండన్ లో ఉంది. కోహినూర్ నేపథ్యంలో క్రిష్ గారు కథ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించి సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ సినిమా కోసం మేము మా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము. నాకు తెలిసిన వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ తో 18 నిమిషాల క్లైమాక్స్ ను నేను కొరియోగ్రఫీ చేశాను. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.
కర్ణాటక అటవీ శాఖ మంత్రివర్యులు ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ జనరేషన్ లోని గొప్ప నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప మనిషి కూడా. సమాజానికి సేవ చేయడంలో ముందుంటారు. సినీ రంగంతో పాటు, రాజకీయం రంగంలోనూ రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీలు వేరయినా సమాజానికి సేవ చేయడమే మా లక్ష్యం. నిర్మాత ఈ వేడుకకు ఆహ్వానించడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. యువత ఆయనను అనుకరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే బడా హీరో, బడా నిర్మాత కలిసి చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆశిస్తూ.. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ తో, అగ్రశ్రేణి కథానాయకుడిగా ఒక పక్కన.. మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి.. రాజకీయం రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ.. ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ మాటలు అయితే చెప్తారో వాటిని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దేశభక్తి, జాతీయ వాదం గురించి ఆయన పదే పదే మాట్లాడుతుంటారు. హరి హర వీరమల్లు టైటిల్ చూసినా, కథాంశం చూసినా నాకు అనిపించేది ఒక్కటే.. దేశంలోని యువతకు దేశభక్తి, జాతీయ వాదం గురించి చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ఇంతకాలం ఈ సినిమా కోసం నిలబడిన రత్నం గారికి అభినందనలు. ఈ సినిమాలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు.” అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ, “శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం హరి హర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఈ సినిమాలో చూడబోతున్నాం. జూలై 24 ఎప్పుడు వస్తుందా అని మీ అందరితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం, ఒక ఉద్వేగం. ఎంతో ఉన్నతమైన వ్యక్తి. అలాగే ఎ.ఎం. రత్నం గారు ఎంతో ధైర్యమున్న వ్యక్తి, ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి. ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకొస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.
ప్రముఖ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. చాలా గొప్పవాడు. 17 ఏళ్ళ వయసు నుంచి పవన్ కళ్యాణ్ ని చూస్తున్న వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచే ఈ సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఉండేవాడు. తనంతట తాను వేసుకున్న బాటలో నడిచి వెళ్ళాడు తప్ప.. ఎవరో వేసిన బాటలో వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. తన బాటలో వస్తున్న ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు.. తనంతట తాను ఎదురుతిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప.. ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో పదిమందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనొక స్వయం శిల్పి. తనను తాను చిక్కుకున్న శిల్పి. డెస్టినీనే ఆయనను నడిపిస్తుంది. అనుకోకుండా నటుడు అయ్యారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యారు. లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నయినా అనుకోనివ్వండి. సముద్రమంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే.. స్ట్రయిట్ నిలబడి చెప్పగల ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. పుట్టుక నీది, చావు నీది.. బ్రతుకంతా దేశానిది. ఈ మాట పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.” అన్నారు.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను. కానీ, నాకు ఈ సినిమా ప్రత్యేకమైనది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించిన మొదటి హిస్టారికల్ ఫిల్మ్, మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ ను నిర్మించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. సినిమాల ద్వారా ఎంతో కొంత సందేశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఈ సినిమా కూడా వినోదం అందించడంతో పాటు, ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాము” అన్నారు.
చిత్ర నిర్మాత ఎ. దయాకర్ రావు మాట్లాడుతూ, “ఆరు సంవత్సరాల తర్వాత, అనేకమంది కృషి ఫలితంగా మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అభిమానులకు విందు ఇవ్వడానికి వస్తోంది. జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రం.. అభిమానులకు పెద్ద ఉత్సాహాన్ని, అంతకంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తుంది. మేము కష్టపడి తీశాము. ఇక ఆదరించాల్సిన బాధ్యత అభిమానులపైనే ఉంది. ట్రైలర్ చూశారు కదా. దానికి ఎన్నో రెట్లు సినిమా ఉండబోతుంది. అభిమానులు ఇదే ఉత్సాహంతో సినిమాకి ఘన విజయం అందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.
చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు టైటిల్ పెట్టిన క్రిష్ గారికి ముందుగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారు. ఔరంగజేబు అంటే పవర్ ఫుల్ మొఘల్ కింగ్. అంత పవర్ ఫుల్ రూలర్ కి ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన అనారోగ్యంతో 1680లో చనిపోయారు. ‘హరి హర వీరమల్లు’ కథ 1684లో స్టార్ట్ అవుతుంది. ఛత్రపతి శివాజీ చివరి కోరిక ఏంటంటే.. మొఘల్స్ నుంచి జ్యోతిర్లింగాలు కాపాడాలని, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కాపాడాలని. ఆయన మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే వీరమల్లు. ప్రతి శతాబ్దానికి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. ఈ శతాబ్దానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్ డిజైన్ చేశారు. దానిని చూసి ఈ కథని ధర్మం కోసం జరిగే యుద్ధంగా మలిచాము. ఆ ఫైట్ ని త్రివిక్రమ్ గారికి చూపిస్తే ఎంతగానో ప్రశంసించారు. మా నాన్న ఎ.ఎం. రత్నం గారి గురించి చెప్పాలంటే.. అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదించి ఇస్తారు, మాకు మా నాన్న మంచి సంపాదించి ఇచ్చారు. ఆ పేరు వల్లే ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ‘పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి.. రెండు గంటలు నీ గురించి మాట్లాడుతూ అభినందించారు’ అని త్రివిక్రమ్ గారు చెప్పారు. ఆ మాట విని నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాకు ఈ అవకాశమిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది.” అన్నారు.
చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు ఒక ఎమోషనల్ డే లాగా ఉంది. ఎందుకంటే, ఈరోజు కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమానిని. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎ.ఎం. రత్నం గారికి మనస్ఫూరిగా సెల్యూట్ చేస్తున్నాను. ఆయనలా సినిమాని ఎవరూ మోయలేరు అనిపిస్తుంది. రత్నం గారి కోసం ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘ఈసారి డేట్ మారదు, రికార్డులు మారతాయి” అని జ్యోతికృష్ణ గారు చెబుతుంటారు. ఆయన మాట నిజం కావాలని ప్రార్థిస్తున్నాను. కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు. మనోజ్ పరమహంస గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.