Gayatri Bhargavi: ఇచ్చే గౌరవం ఇదేనా? : గాయత్రి భార్గవి
సోషల్ మీడియా బాగా ఎక్కువైన నేపథ్యంలో నిజంతో పన్లేకుండా ఇష్టమొచ్చినట్టు ఎవరికి నచ్చింది వాళ్లు పోస్ట్ చేసేస్తున్నారు. ఇలాంటి సమాచారం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడా లిస్టులోకి టాలీవుడ్ యాంకర్, నటి గాయత్రి భార్గవి(Gayatri Bhargavi) చేరారు. కొన్నాళ్ల కిందట గాయత్రి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ ఇంటర్వ్యూలో తన భర్త విక్రమ్ గురించి మాట్లాడింది గాయత్రి. విక్రమ్ ఆర్మీ ఆఫీసర్ అని చెప్తూ, ఆర్మీ అధికారులు దేశం కోసం పడే కష్టాలను, వారు చేసే ప్రాణ త్యాగాల గురించి మాట్లాడింది. గాయత్రి చెప్పిన దాన్ని యూట్యూబ్ ఛానెల్ గాయత్రి భర్త చనిపోయాడనే అర్థమొచ్చేలా థంబ్ నైల్ పెట్టి రిలీజ్ చేసింది. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ గాయత్రి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
గతంలో ఇలానే థంబ్ నైల్స్ పెట్టడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా వాటిని డిలీట్ చేశారని, ఇప్పుడు మళ్లీ అలానే చేస్తున్నారని గాయత్రి అంటోంది. ఆ వీడియోలో భర్తను చూపిస్తూ, తన భార్త బ్రతికే ఉన్నాడని చెప్తోన్న గాయత్రి, ఆర్మీకి మీరిచ్చే గౌరవమిదేనా అని సదరు యూట్యూబ్ ఛానెల్ ను ప్రశ్నిస్తూ తన భర్తకు క్షమాపణలు చెప్పింది. ఇదే వీడియోలో గాయత్రి భర్త విక్రమ్ కూడా ఆ యూట్యూబ్ ఛానెల్ పెట్టిన థంబ్ నైల్స్ చూస్తుంటే ఆర్మీపై వారికి ఎంత గౌరవముందో అర్థమవుతోందన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకుండా మీడియా బాధ్యత వహించాలని, ఈ విషయంలో తమకు ఆ యూట్యూబ్ ఛానెల్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని గాయత్రి డిమాండ్ చేసింది.













