రివ్యూ: భారీ ఖర్చే గాని, కథ లో గతి తప్పిన ‘గౌతమ్ నంద’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్: 2/5
బ్యానర్: శ్రీ బాలాజీ సినీ మీడియా
తారాగణం: గోపిచంద్, హన్సిక, క్యాథరిన్, సచిన్ ఖేడ్కర్, చంద్రమోహన్, ముఖేష్ రుషి, సీత, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి తదితరులు
కూర్పు: గౌతరరాజు, సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఛాయాగ్రహణం: ఎస్. సౌందర్ రాజన్
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది
విడుదల తేదీ:28.07.2017
ఎగ్రెసివ్ హీరో గోపీచంద్, సంపత్ నందిల కాంబినేషన్ లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకం పై జె.భగవాన్, జె .పుల్లా రావు లు నిర్మాతలుగా, రూపొందించిన ‘గౌతమ్ నంద’ చిత్రం ఈరోజే విడుదలైంది. దుబాయ్ లోని యాక్షన్ పార్ట్ ట్రైలర్స్ తో హాలీవుడ్ సినిమాను తలపించి, ఆరంభం నుండి మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
వరల్డ్ రిచ్ మెన్ లో ఒకరైన కృష్ణ మూర్తి కొడుకు గౌతం (గోపిచంద్) జల్సా జీవితాన్ని గడుపుతుంటాడు. డబ్బు తప్ప ఎలాంటి ఎమోషన్స్ ఉండని గౌతం కు ఓ సందర్భంలో ఉన్నట్టుండి తను ఎవరు అన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తన పోలికలతో ఉన్న నంద(గోపిచంద్) ని చూసి షాక్ అవుతాడు.బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ చూస్తోన్న యన్టీఆర్ రాముని మించిన రాముడు, ఎన్నార్ మంచివాడు, వాణిశ్రీ గంగ మంగ, చిరంజీవి దొంగ మొగుడు, రౌడీ అల్లుడు వంటి ఎన్నో పాత చిత్రాలలో డ్యూయెల్ పాత్రలు రిపీట్ చేస్తూ, బస్తీలో పేదరికం అనుభవిస్తున్న నంద ప్లేస్ లో గౌతం.. గౌతం ప్లేస్ లో నంద వెళ్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇద్దరు పాత్రలు మార్చుకున్నాక జరిగిన కథ ఏంటి..? ఇద్దరికి ఎదురైన అనుభవాలే ఈ సినిమా కథ.ఇద్దరు ఒకేలాగుంటారు. ఒకరి స్థానంలోకి ఒకరు వెళతారు. తరువాత ఆ ఇద్దరి జీవితాల్లో ఏమి జరుగుతుంది? అనేది మిగతా కథ..
ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ :
గోపిచంద్ హీరోగా రాణించాడు కానీ విలన్‌గా ఇంకా బాగుంటాడు. ఈ సంగతిని ‘గౌతమ్ నంద’ ఇంకోసారి ఘనంగా చాటుతుంది. హన్సిక ‘తెల్లతోలు పిల్ల’గా బస్తీ దొరసాని లెక్క అనిపించిందే తప్ప బస్తీ పిల్లలా అస్సలు కనిపించలేదు. క్యాథరిన్ మరోసారి గ్లామర్ పాత్రకే పరిమితం అయింది. మసాలా అవసరార్ధం స్విమ్‌సూట్‌లోను కనిపించిన క్యాథరిన్ అంతకుమించి ఈ పాత్రలో చేయడానికేమీ లేదనుకోండి. ముఖేష్ రుషి నటన, అతనికి రాసిన డైలాగులు, చెప్పిన డబ్బింగ్ డెబ్బయ్‌ల కాలం నాటి విలన్‌ని తలపిస్తాయి. బిత్తిరి సత్తి కాస్త నవ్వించే ప్రయత్నం చేయగా సీనియర్ నటులు తణికెళ్ల భరణి, చంద్ర మోహన్ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ డబల్ రోల్ వేస్తున్న హీరోలు, హీరోయిన్లు వాళ్ళ ప్లేస్ లోకి వీళ్ళు వీళ్ళ ప్లేస్ లో వాళ్ళు మారడం అనే పాయింట్ తో ‘డబ్బు’ అనే మరో ఎక్సయిటింగ్ ఎలిమెంట్ జత చేస్తే కొత్తదనం వచ్చేస్తుందని అనుకున్న సంపత్ నంది, అంతకుమించి ఏమీ ఆలోచించలేకపోయాడు. డబ్బున్న వాడంటే ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవంతులు, బ్రాండెడ్ బట్టలు, యాక్ససరీలు… పేదవాడంటే చిల్లు పడ్డ ఇంటి పైకప్పు, ఆకలిదప్పులు, దోమలు, నీళ్ల కోసం ఫైట్లు అన్నట్టు అవే విషయాలని తిప్పి, తిప్పి చూపించాడే తప్ప అపారమైన ధనంతో తన జీవన విధానం లో ఏం కోల్పోయాడో, అస్సలు డబ్బుల్లేక ఇతనెంత కష్టపడ్డాడో ఎస్టాబ్లిష్ చేయలేదు. కనీసం రెండు క్యారెక్టర్లు చనిపోదామనుకునే డెసిషన్ తీసుకోవడానికి అయినా ఒక బలమైన కారణం వుండాలి. ఆ కారణం ఏంటో తెలియదు. వచ్చిన సీన్లే రిపీట్ అవుతూ, మొదలైన చోటి నుంచి కథ ముందుకి కదలక, పతాక సన్నివేశాల వరకు ఆసక్తిగొలిపే ఒక్క అంశమూ కూడా కనిపించదు. ఈ విషయం లో సంపత్ నంది ఫెయిల్ అయ్యాడు. సంభాషణలు రాసుకోవడం లో కానీ, అతని మేకింగ్ స్టయిల్ కానీ ఈ ట్రెండుకి తగ్గట్టు గా లేవు.కథలో గాని సన్నివేశాలలో గాని అసలు విషయం లేకపోయే సరికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అయినా సందడి చేద్దామని చూసిన తమన్ అత్యుత్సాహం చూపించి కాస్త ఎక్కువ గా బాదడనుకుంటా… ప్రేక్షకుడికి చెవి నొప్పి, తల నొప్పి తప్ప ఒరిగిందంటూ ఏమీ లేదు. పాటలు సైతం ఇంకోసారి వినాలనిపించే ఫీల్ కూడా తీసుకు రాలేదు. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఈ చిత్రాన్ని రిచ్‌గా తీర్చిదిద్దాడు. నిర్మాతలు పెట్టిన ఖర్చుకి మించిన అవుట్‌పుట్ ని తీసుకొచ్చాడు. కలర్ గ్రేడింగ్, ఎఫెక్ట్స్ వగైరా కూడా బాగున్నాయి.ఎడిటింగ్ ఓకే..
విశ్లేషణ :
ఓవరాల్ గా గోపిచంద్ తనకు నచ్చిన మాస్ ఎలిమెంట్స్ తో గౌతం నంద తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథలో ఇద్దరు అచ్చు గుద్దినట్టు ఉండటం వారి వారి పరిస్థితుల కారణంగా ఒకరి ప్లేస్ లో మరొకరు వెళ్లడం లాంటి కథలు అనాదిగా చూస్తూనే వున్నాం. అయితే సినిమా నడిపించిన తీరు మొదటి భాగం సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలున్నాయి. ముఖ్యంగా గోపిచంద్ ఫైట్స్ అదరగొట్టాడు. అయితే అక్కడక్కడ కొన్ని లాజిక్కులు మిస్ అవడం జరుగుతుంది. క్లయిమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ చెబితే తప్ప అస్సలు ఇంట్రెస్ట్ కలిగించని కాన్సెప్ట్ తీసుకుని, ఇంత ఫ్లాట్ స్క్రీన్‌ప్లేతో స్టోరీ నెరేట్ చేస్తే రక్తి కడుతుందని దర్శకుడు ఎలా భావించాడో అర్థం కాదు. కనీసం ఆ ట్విస్టు తర్వాత జరిగేది అయినా ఎక్సయిటింగ్‌గా వుంటుందా అంటే అదీ లేదు.
ఫ్రేమ్స్ అన్నీ రిచ్‌గా వుంటే కళ్లు రిక్కించి చూసేస్తారనే భ్రమలో వున్నట్టుగా కేవలం ఫ్రేమింగ్ మీదే దృష్టి పెట్టిన సంపత్ నంది కాస్త కూడా కథనం మీద దృష్టి సారించలేదు. దీంతో అతను నిజంగా ఎమోషన్స్ చూపించినపుడు కూడా అవి కదిలించక పోగా, టివి సీరియల్ లా సప్పగా వున్నాయి.కానీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో, అవసరానికి మించిన స్టయిల్‌తో అసలు వదిలేసి కొసరు విషయాల మీద దృష్టి పెట్టడంతో మొదటికే మోసం వచ్చి బోరింగ్ గా మారింది. చివరి పావుగంట పాటయినా ఆ మాత్రం ఆసక్తి కలగకపోతే కనుక అసలు ఈ సినిమా గోపీచంద్, నిర్మాణ రంగం లో ఎంతో అనుభవం వున్న భగవాన్, పుల్లా రావు లకు ఏ విధంగా ఈ సినిమా కథ నచ్చిందో వారికే తెలియాలి. అంత విషయ శూన్యంగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమూ కష్టమే…పాపం నిర్మాతలు అనిపిస్తుంది….గౌతమ్ నంద ఎఫెక్ట్ తో రాబోయే గోపి చంద్ ‘ఆక్సిజన్,’ ‘ఆరడుగుల బులెట్’ చిత్రాలు ఎంత వరకు బిజినెస్ పరంగా సక్సెస్ అవుతాయో వేచిచూడాలి.