Manam Saitham: నటుడు రామచంద్రకు ‘మనంసైతం’ కుటుంబం ద్వారా కాదంబరి కిరణ్ ఆర్థిక సాయం

తెలుగు సినీ నటుడు, ‘మనంసైతం’ (Manam Saitham) నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘వెంకీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, కాదంబరి కిరణ్ ఆయనకు సహాయం అందించారు. ఇటీవల పక్షవాతం రావడంతో సినిమా రంగానికి దూరమైన రామచంద్రను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సందర్శించి, వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
కాదంబరి కిరణ్ రామచంద్రను ఆప్యాయంగా పలకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి ధైర్యం, భరోసా కల్పించారు. కాదంబరి కిరణ్ అందించిన సాయానికి రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.
‘మనం సైతం’ సంస్థ ద్వారా దశాబ్దకాలంగా అనేకమంది అవసరార్థులకు సాయం అందిస్తున్న కాదంబరి కిరణ్, సమాజ సేవకు తమ సంస్థ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుందని పునరుద్ఘాటించారు. “అవసరమైన వారికి ‘మనంసైతం’ సంస్థ ద్వారా అండగా నిలవడం తమ బాధ్యత,” అని ప్రకటించారు.