సుకుమార్ ను ఫాలో అవుతున్న ప్రశాంత్ నీల్
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రెజెంట్ తెలుగులోనే కాదు, ప్రపంచంలోనే పాపులారిటీని దక్కించుకున్నాడు. అల్లు అర్జున్ తో పుష్ప లాంటి సినిమా తెరకెక్కించిన సుక్కూ రేంజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అయిపోయాడు. ఓ వైపు పుష్ప2 తీస్తూనే మరోవైపు చిన్న సినిమాలను నిర్మిస్తూ, వాటికి రచనా సహకారం అందిస్తూ బిజీగా ఉంటున్నాడు సుకుమార్.
సుకుమార్ ఏదైతే చేస్తున్నాడో అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఇక నుంచి తన శిష్యులతో చిన్న సినిమాలు చేయించే పనిలో ఉండనున్నాడు. ఇప్పటికే కొన్ని స్టోరీలను రెడీ చేసిన ప్రశాంత్, కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్‌లో తన శిష్యులతో కలిసి సినిమాలను ప్రేక్షకుల ముందుకుతీసుకురాబోతున్నట్లు సమాచారం.
త్వరలోనే మొదలు కాబోతున్న ఓ కన్నడ మూవీకి ప్రశాంత్ కథ, స్క్రీన్ ప్లే అందించనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ప్రశాంత్, ప్రభాస్ తో భారీ బడ్జెట్‌తో సలార్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సలార్ పూర్తయ్యాక ఎన్టీఆర్ తో సెట్స్ మీదకు వెళ్లనున్నాడు ప్రశాంత్ నీల్.
సలార్ మూవీ పాన్ ఇండియన్ రేంజ్లో భారీగా కలెక్ట్ చేసేలా ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నాడు. కేజీఎఫ్ ను మించేలా సలార్ ఉండాలని, దాని కోసం ఎక్కడా ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారని చిత్ర వర్గాల భోగట్టా. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీ గా శృతి హాసన్ నటించనుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో నిర్మాణ సంస్థ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.













