దిల్ రాజు జాగ్రత్త పడాల్సిన టైమొచ్చింది
ఒకప్పుడు దిల్ రాజు ఒక సినిమాను మెచ్చుకున్నాడంటే దానికి హిట్ ముద్ర పడినట్లే. కానీ గత కొన్నేళ్లుగా దిల్ రాజు జడ్జ్మెంట్ లెక్క తప్పుతున్న వైనం బాక్సాఫీస్ రిజల్ట్స్ లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. దిల్ రాజు ఎంతో నమ్మిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమాను ఆడియన్స్ ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకుంటారన్నాడు కానీ ఆ సినిమా కనీసం రెండు వారాలు కూడా ఆడలేకపోయింది.
రీసెంట్ గా లవ్ మి సినిమా విషయంలో కూడా ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. ఆర్య కథ విన్నప్పుడు కలిగిన ఫీలింగ్ ఈ సినిమాకు కలిగిందన్నాడు. కానీ ఆ సినిమా కూడా మంచి రిజల్ట్ ను ఇవ్వలేకపోయింది. సినిమాల సంఖ్య పరంగా టాలీవుడ్ లోని మిగిలిన నిర్మాణ సంస్థలతో పోటీ పడుతున్న దిల్ రాజు కంటెంట్ పరంగా మాత్రం వారికి కనీస పోటీ ఇవ్వలేకపోతున్నాడు.
దిల్ రాజు బ్యానర్ లో ప్రస్తుతం చిన్న, పెద్దా సినిమాలు చాలానే తెరకెక్కుతున్నాయి. అయితే ఎస్వీసీ బ్యానర్‌కు పూర్వ వైభవం రావాలంటే దిల్ రాజు కంటెంట్ పరంగా ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2018 నుంచి దిల్ రాజు ఖాతాలో ఉన్న కమర్షియల్ హిట్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఒక సినిమా తీర్పు విషయంలో ఎంతో పక్కాగా ఉండే దిల్ రాజు ఇకపై మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది.













