పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూట్ మార్చాల్సిందే
ఎంత పెద్ద నిర్మాణ సంస్థకైనా సరే వరుసగా ఫ్లాపులొస్తే తట్టుకోవడం కష్టమే. వరుస డిజాస్టర్లతో అసలు సినీ నిర్మాణానికి దూరమైన సంస్థలుచాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యానర్ గా పేరొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాత్రం వరుస ఫ్లాపులొచ్చినా సరే వాటన్నింటినీ తట్టుకుని స్ట్రాంగ్ గా నిలబడుతుంది.
మొదట్లో ఈ బ్యానర్ నుంచి చిన్న, మధ్య తరహా సినిమాలే వచ్చాయి. వేరే బ్యానర్లతో కలిసి సినిమాలు చేశారు. అలా ఓ బేబీ, గూఢచారి, కార్తికేయ2 లాంటి భారీ హిట్లు అందుకున్నాయి. దీంతో తర్వాత నుంచి సొంతంగా భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టిందీ సంస్థ. ఒకే టైమ్ లో ఈ బ్యానర్ నుంచి ఏకంగా 25 సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయంటే ఆ బ్యానర్ దూకుడు అర్థం చేసుకోవచ్చు.
అందులోనూ ఆ 25 సినిమాలు కూడా క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమాలే. అయితే ఎంత పెద్ద బ్యానర్కైనా సరే ముఖ్యమైనది మాత్రం సక్సెసే. తమ బ్యానర్ నుంచి ఎన్ని సినిమాలొచ్చాయనే దానికంటే ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయనేది ముఖ్యం. ఈ విషయంలో పీపుల్ మీడియా సంస్థ బాగా వెనుకబడిపోయింది. ధమాకా తర్వాత ఈ బ్యానర్ లో సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. బ్రో, ఈగల్, మనమే, రామబాణం, మిస్టర్ బచ్చన్ ఇలా ప్రతీ సినిమా బోల్తా కొడుతూనే ఉంది. దీంతో ఆ సంస్థకు నష్టాలు తప్పడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పీపుల్ మీడియా సంస్థ సినిమాల సంఖ్య మీద కాకుండా కంటెంట్ మీద ఫోకస్ చేసి ఆ దిశగా సినిమాలు చేస్తే నష్టాన్ని తగ్గించుకునే అవకాశముంటుంది.













