TGFA: హాలీవుడ్‌కు హైదరాబాద్ కేంద్రం కావాలి… గద్దర్ సినిమా అవార్డుల వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్‌కు హైదరాబాద్ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా ముందు వరుసలో ఉందని చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగిన గద్దర్ సినీ అవార్డుల (Telangana Gaddar Film Awards) ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సినీ రంగం భవిష్యత్తు మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై సినీ పరిశ్రమ ఎదిగేందుకు, అది దేశానికి ఆదర్శంగా మారేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సినీ ప్రముఖులకు సీఎం రేవంత్ సూచించారు. ‘‘మీరు ప్రణాళికలు రచించండి.. ప్రభుత్వంగా మేం అమలు చేస్తాం..’’ అని స్పష్టమైన హామీ ఇచ్చారు.
సినీ పరిశ్రమ ఇంకా గొప్పగా ఎదగాలని, దేశానికే ఆదర్శంగా మారాలని ఆకాంక్షించారు. వచ్చే 22 ఏళ్లపాటు నేను క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని, అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తానని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లుగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మీకు కఠినంగా కనిపిస్తుంది.. కానీ, మిమ్మల్ని అభిమానిస్తూ ప్రోత్సహిస్తుందన్న విషయం మరిచిపోవద్దని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన 500 కంపెనీలుంటే.. అందులో 85 కంపెనీలు హైదరాబాద్లోనే ఉండడం, ఇక్కడి నుంచేకార్యకలాపాలు నిర్వహిస్తుండడం శుభపరిణామమని పేర్కొన్నారు.
దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ఫిల్మ్ అవార్డులను తమ ప్రభుత్వంలో మొదలు పెట్టడం, గతంలో ఉన్న మంచి సాంప్రదాయాన్ని కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలోనే కాదు.. ఇప్పుడు, ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అభిమానిస్తూ సినీ రంగాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని భరోసా ఇచ్చారు. 1964లో సినీ ప్రముఖులను గుర్తించడానికి ‘నంది’ పేరుతో ఈ అవార్డులు మొదలయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు మొట్టమొదటి అవార్డు అక్కినేని నాగేశ్వరరావుకు దక్కిందని చెప్పారు. ఇప్పుడున్నది నాలుగోతరం సినీ పరిశ్రమ అని, పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి అనేక మంది గొప్ప నటులు భావితరాలను ముందుకు నడిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ గద్దర్ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు.
ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్ గురించి వెల్లడిరచాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ హైటెక్స్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఎఫ్‌ఎసీ ఛైర్మన్ దిల్ రాజు సహా ఇతర రాజకీయ, సినీ ప్రము ఖులు హాజరయ్యారు. భట్టి, కోమటిరెడ్డి, దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2014 నుంచి 2024 వరకూ గద్దర్ అవార్డుల పురస్కార గ్రహీతలకు సీఎం రేవంత్ చేతుల మీదుగా అందజేశారు. అవార్డు గ్రహీతలకు సిల్వర్ మెమొంటో, రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రశంసా పత్రం అందించారు. వందలాదిగా ప్రముఖ సినీ తారల రాకతో హై టెక్స్ ప్రాంగణం సందడిగా మారింది. సినీ ప్రముఖులు బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, సుకుమార్, మణితర్నం, సుహాసిని తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా జ్యూరీ కమిటీనీ సత్కరించారు. మురళీ మోహన్, జయసుధ తదితరులు పురస్కారాలు అందుకున్నారు. ఇప్పటివరకు ‘‘గామి’’ సినిమాకు గానూ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా విశ్వనాథ్ రెడ్డి, ఉత్తమ్ ఆర్ట్ డైరెక్టర్ గాఅద్నితిన్ జిహానీ చౌదరి.. ‘‘కల్కి-2898 ఏడీ’’ సినిమాకు అవార్డులు అందుకున్నారు.
తనకు అవార్డు రావడానికి ప్రేక్షకులు, అభిమానులే కారణమని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. అవార్డు నా అభిమానులకు అంకితమని ప్రకటించారు. తనకు ఈ పురస్కారం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సినిమా వేడుక కనుక ఒక డైలాగ్ చెబుతానంటూ వేదికపై ఉన్న రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని పుష్ప -2 సినిమాలో ‘‘ఆ బిడ్డ మీద చెయ్యి పడితే రప్పా రప్పా నరుకుతా’’ అని అభిమానులు విజిల్స్ వేసేలా తనదైన శైలిలో డైలాగ్ చెప్పారు. తనకు లభించిన అవార్డును ఏఏ ఆర్మీ (అల్లు అర్జున్ అభిమానులకు)కి అంకితం చేశారు.
దేశ ఔన్నత్వానికి దోహదపడిన ప్రజా గాయకుడు గద్దరన్న పేరుమీద రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులివ్వడం ఎంతో సంతోషదాయకమని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రతి నటుడికీ స్వర్గీయ ఎన్టీఆర్ మార్గదర్శకుడిగా, ఆదర్శప్రాయుడిగా నిలిచారని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రాలు వేరు అయినా మనమంతా తెలుగువాళ్లమే. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చలన చిత్ర ఉత్సవాన్ని జరుపుతుందన్నందుకు, అందులో నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ తనయుడిగా ఆ అవార్డును తెలంగాణలో మొట్టమొదటిసారి గ్రహీతను అవడం నా పుర్వజన్మసుకృతంగా భావిస్తున్నానన్నారు.
సినీ రంగంలో తన ప్రతిభ ఖండాంతరాలు దాటడానికి బాసర సరస్వతీమాత ఆశీర్వాదం ఉందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుమీద తనకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ నటీనటులతో పాటు వివిధ విభాగాలకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 73 గద్దర్ అవార్డులు ప్రకటించింది. ఒక్కో ఉత్తమ చిత్రానికి రూ.10లక్షల నగదుతో పాటు మెమెంటో అందజేశారు. ద్వితీయ ఉత్తమ చిత్రానికి రూ.7 లక్షలు, తృతీయ ఉత్తమ చిత్రానికి రూ.5 లక్షలతోపాటు మెమెంటో బహూకరిం చారు. మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు అవార్డుల ప్రదానం చేశారు.
ప్రత్యేక అవార్డులు…
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ
పైడి జైరాజ్ అవార్డు: మణిరత్నం
బీఎన్‌రెడ్డ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణ చంద్రరావు
కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ
రఘుపతి వెంకయ్య అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : అధ్నితిన్ జి హానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : నల్ల శ్రీను (రజాకార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్(కల్కి 2898 ఏడీ)
ఉత్తమ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ కథా రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్,
ప్రథమ ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ద్వితీయ ఉత్తమ చిత్రం: పొట్టేల్
తృతీయ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: ఆయ్: మేం ఫ్రెండ్సండీ
ఉత్తమ సహాయ నటుడు: ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్) ఉత్తమ నేపథ్య గాయకుడు: సిధ్ శ్రీరామ్: ఊరు భైరవ కోన
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్: పుష్ప2
చదువుకోవాలి చిత్రానికి ప్రత్యేక అవార్డు