మరో రీమేక్ కి రెడీ అవుతున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా ‘ఆచార్య’ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి దానికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. తాజాగా చిరంజీవికి సంబంధించిన న్యూస్ అందర్నీ ఎంతో ఎక్సైట్ చేస్తుందనడంలో సందేహం లేదు. అదేమిటంటే, తాను త్వరలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు చిరంజీవి. తమిళ్లో సూపర్‌హిట్ అయిన ‘వేదాళం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించనున్నారు.
‘వేదాళం’ సినిమాను రీమేక్ చెయ్యాలన్న ఆలోచన చిరంజీవిదే. ఈ సినిమా రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించనున్నారని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా తమిళ్లో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’కి రీమేక్. మయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ విషయానికి వస్తే ఈ చిత్రంలో మంచి మెసేజ్ ఉంటుంది. రామ్‌చరణ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఆగస్ట్ 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.













