ఏఐ డీప్ ఫేక్ పై చిన్మయి ఆగ్రహం
ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోలపై సింగర్ చిన్మయి శ్రీపాద (chinmayi sripada) మరోసారి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తాజాగా జాన్వీ కపూర్(janhvi kapoor)కు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒరిజినల్ కంటెంట్‌ను డిజిటల్‌గా మార్చి అభ్యంతరకరంగా చూపించడమే కాకుండా, దాన్ని చూసేందుకు కొందరు ఆసక్తి చూపుతున్న తీరుపై చిన్మయి అసహనం వ్యక్తం చేశారు.
ఎవరినీ నేరుగా పేరుపెట్టి ప్రస్తావించకుండా సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయిన చిన్మయి.. ఓ హీరోయిన్ కు సంబంధించిన ఏఐ డీప్‌ఫేక్ వీడియోను రూపొందించారని, దాని లింక్ కోసం కొందరు కామెంట్లలో అడుగుతున్నారని పేర్కొన్నారు. కేవలం వీడియో ను క్రియేట్ చేసిన వారిపైనే కాకుండా, అలాంటి కంటెంట్ కోసం వెతుకుతూ, దాన్ని ప్రోత్సహించే విధంగా స్పందిస్తున్న వారిపైనా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. మహిళల అనుమతి, వ్యక్తిగత హక్కులు వంటి అంశాలను పట్టించుకోని ఈ ధోరణి తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ఆమె తన కామెంట్స్ ద్వారా స్పష్టం చేశారు.
ముఖ్యంగా మహిళల సమ్మతి గురించి మాట్లాడినప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసే వారే, ఇలాంటి డీప్‌ఫేక్ కంటెంట్ విషయంలో మాత్రం ఆసక్తి చూపుతున్నారని చిన్మయి విమర్శించారు. ఈ ఘటనను ఆమె కేవలం ఓ మార్ఫింగ్ వీడియో వివాదంగా కాకుండా, సమాజంలో మహిళల పట్ల సమ్మతి, గౌరవం విషయంలో ఉన్న వైఖరికి సంబంధించిన అంశంగా ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో దాని దుర్వినియోగంపై మరింత బాధ్యత అవసరమనే డిస్కషన్‌కు చిన్మయి కామెంట్స్ దారితీశాయి.








