బిజినెస్ ప్లాన్స్ విషయంలో తగ్గేదేలే!
ఒకప్పుడంటే హీరోలైనా, హీరోయిన్లైనా తాము సంపాదించినదంతా కష్టమో నష్టమో మళ్లీ సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేసేవాళ్లు. అయితే అందరికీ భిన్నంగా మురళీమోహన్, శోభన్ బాబు లాంటి వాళ్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. కానీ ఇప్పుడు హీరోలు మాత్రం చాలా కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ ను ఓపెన్ చేసి సక్సెస్ అయ్యాడు. అది చూసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే ఏషియన్ సంస్థతో చేతులు కలిపి తన పేరు వచ్చేలా హైదరాబాద్లోని అమీర్ పేటలో మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడీ బిజినెస్ ను బన్నీ వైజాగ్ కు కూడా విస్తరించబోతున్నాడని తెలుస్తోంది.
బిజినెస్ ను విస్తరించడంలో అల్లు అర్జున్, తన తండ్రి అరవింద్ ను మించిపోయాడనేలా బన్నీ ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే అల్లు స్టూడియోస్ నిర్మాణానికి పునాది వేశాడు బన్నీ. దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్ లో చిరూ, అల్లు అరవింద్ ఇప్పటి వరకు ఎప్పుడూ స్టూడియో ఆలోచనే చేయలేదు. కానీ బన్నీ మాత్రం వారికి భిన్నంగా తన బిజినెస్ ను విస్తరించుకుంటూ పోతూ అల్లు బ్రాండ్ ను మరింత ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అంతే కాదు, బన్నీ తన మల్టీప్లెక్స్ లను బెంగుళూరు, విజయవాడ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా తన నెట్వర్క్ ను పెంచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.













