క్రేజీ లైనప్‌ను సిద్ధం చేసిన బెల్లంబాబు
బెల్లంకొండ సురేష్ కొడుకుగా టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే కొన్ని సినిమాలతో అలరించాడు. తను చేసిన సినిమాలు కలెక్షన్ల పరంగా ఎలా ఉన్నా టాలీవుడ్ లో టైర్2 హీరోల్లో ఒకడిగా బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సరైన స్టోరీ పడితే తన నుంచి మంచి పెర్ఫార్మెన్స్ ను చూడొచ్చు.
చివరగా తెలుగులో శ్రీనివాస్ చేసిన సినిమా అల్లుడు అదుర్స్. ఈ సినిమా తర్వాత హిందీ ఆడియన్స్ కు దగ్గరవ్వాలని ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో వివి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేశాడు. కానీ ఆ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.
దీంతో కొంత గ్యాప్ తీసుకున్న బెల్లంబాబు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ ఉగాది సందర్భంగా తన ఫ్యాన్స్ కు విషెస్ చెప్తూ తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను వెల్లడించాడు.
తన ప్రొఫెషనల్ లైఫ్ లో తనకు తోడుగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ ఏడాది కొత్త సినిమాలతో ఆడియన్స్ ముందుకు రానున్నట్లు తెలిపాడు. టైసన్ నాయుడు షూటింగ్ దశలో ఉందని చెప్పిన శ్రీనివాస్, దీంతో పాటూ షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఓ సినిమా, మూన్ షైన్ ప్రొడక్షన్స్ లో మరో సినిమా చేయనున్నట్లు పేర్కొన్నాడు. ఈ రెండు సినిమాలకు డైరెక్టర్లు ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాలు బెల్లంబాబుకు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.













