కొత్త లుక్‌తో అదుర్స్ అనిపిస్తున్న అల్లుడు శీను!
స్టార్ హీరోలు తమ వారసుల మొదటి సినిమాను ఎంతో ఆర్భాటంగా స్టార్ట్ చెయ్యాలని, రిచ్‌గా తెరకెక్కించాలని ఆశ పడుతూ ఉంటారు. కానీ, ఓ నిర్మాత తన కుమారుడు నటించే తొలి సినిమా మామూలుగా ఉండకూడదనుకున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమాను 40 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. అతనెవరో కాదు బెల్లంకొండ సురేష్. అతని కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమా పేరు అల్లుడు శీను. కమర్షియల్‌గా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విశేషం ఏమిటంటే ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆరు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు చేసిన నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తోనే నిర్మించారు. బడ్జెట్ పరంగా చూస్తే ఇప్పటివరకు శ్రీనివాస్‌కి సరైన హిట్ రాలేదనే చెప్పుకోవాలి. తమిళ్లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాలు తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్‌కి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో `అల్లుడు అదుర్స్` పేరుతో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా ఓ భారీ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తనకు కందిరీగ వంటి సూపర్‌హిట్ సినిమా చేసే అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేష్ కుమారు శ్రీనివాస్‌కి మంచి కమర్షియల్ హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో పనిచేస్తున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ ఫోటో షూట్ జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇప్పటివరకు శ్రీనివాస్ కనిపించని కొత్త లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన నభా నటేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బేనర్‌పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయి ఇటీవల తిరిగి ప్రారంభమైన ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.













