ప్రభాస్‌కి విలన్‌గా…
‘బాహుబలి’ చిత్రంతో హీరో ప్రభాస్‌కి ఎంత ఖ్యాతి వచ్చిందో.. ఆ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’తో అంతటి అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందర్నీ నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘జిల్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో మరో భారీ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా జార్జియా షెడ్యూల్ లాక్‌డౌన్‌కి ముందే పూర్తయింది. ఇంకా చాలా షూటింగ్ పెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే మరో సినిమాను ఓకే చేశాడు ప్రభాస్. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్‌తో ‘మహానటి’ చిత్రాన్ని రూపొందించిన నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్టు ఆమధ్య ప్రకటించారు. 2020 సంవత్సరాంతంలో ఈ చిత్రాన్ని ప్రారంభించి, 2021లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా లాక్డౌన్ కారణంగా డిలే కావడంతో మరో సంవత్సరం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయని తెలుస్తోంది. ‘రోజా’తో హీరోగా పరిచయమైన అరవింద స్వామి కొన్నాళ్ళపాటు సినిమాకు గ్యాప్ ఇచ్చి ‘తని ఒరువన్’ అనే తమిళ సినిమాలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ డూపర్‌హిట్ అయింది. అదే సినిమాను తెలుగులో రామ్‌చరణ్‌తో ‘ధృవ’ పేరుతో రూపొందించారు. ఈ సినిమాలోకూడా అరవింద స్వామి విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ చేయబోయే సినిమాలో కూడా అరవింద స్వామి విలన్‌గా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మించనున్నారు.













