మరోసారి బెల్లంబాబుతో అనుపమ
బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లున్నాయి. తను చేసిన సినిమాల్లో కొన్ని మాత్రమే హిట్ అవగా మరికొన్ని ఓ మోస్తరు సినిమాలనిపించుకున్నాయి. ఇంకొన్ని సినిమాలు ఫ్లాపు కూడా అయ్యాయి. శ్రీనివాస్ కెరీర్లో రాక్షసుడు సినిమాకు స్పెషల్ స్థానం ఉంటుంది. రీమేక్ సినిమా అయినప్పటికీ ఆ సినిమాతో బెల్లంబాబు మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటూ నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇదిలా ఉంటే ఆ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ వేరు వేరుగా చాలా సినిమాలు చేశారు కానీ వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చింది లేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన డిస్కషన్స్ ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం.
షైన్ స్క్రీన్ బ్యానర్ లో మురళీ కిషోర్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురం అనే సినిమా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ ను ఫైనల్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కార్తికేయ2 నుంచి అనుపమ మంచి ఫామ్ లో ఉంది. ఈ టైమ్ లో అనుపమ ఈ సినిమా చేస్తే కచ్ఛితంగా ఆ సినిమాకు ప్లస్ అవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.













