మూడో మలయాళ రీమేక్‌కి రెడీ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను నిర్మించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు సూర్యదేవర రాధాకృష్ణ. ఆయన తనయుడు సూర్యదేవర నాగవంశీ `ప్రేమమ్` చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వరసగా సినిమాలు నిర్మిస్తూ తండ్రిలాగే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటున్నాడు. నాగవంశీ నిర్మించిన మొదటి సినిమా `ప్రేమమ్` మలయాళ రీమేక్. ఇటీవల మరో మలయాళ రీమేక్‌కి రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
పృథ్విరాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో `అయ్యప్పనుమ్ కోషియం` పేరుతో మలయాళంలో రూపొంది ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో రవితేజ, రానా హీరోలుగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉండగా తమ బేనర్లో మూడో మలయాళ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు నాగవంశీ. అంతా కొత్తవారితో రూపొందిన `కప్పెలా` చిత్రం ఈ ఏడాది మార్చి 6న విడుదలైంది. ఈ సినిమా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ లాక్డౌన్ తర్వాత థియేటర్స్‌లో ప్రదర్శనకు నోచుకోలేదు. చేసేది లేక జూన్ 22న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. 15 సంవత్సరాలుగా మలయాళంలో నటుడిగా కొనసాగుతున్న మహ్మద్ ముస్తఫా తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తోందని ఆ చిత్ర నిర్మాత విష్ణువేణు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రావాల్సి ఉంది.













