అన్నీ మంచి శకునములే ఆ హీరో చేయాల్సిందట..
ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేయడం ఇండస్ట్రీలో చాలా సర్వసాధారణం. ఇలా చేతులు మారిన స్టోరీలు మారిన కథలు బోలెడు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు సుహృద్భావ వాతావరణంలోనే హీరోల మార్పు జరుగుతూ ఉంటుంది. అన్నీ మంచి శకునములే విషయంలో కూడా అలాంటి మార్పే జరిగిందని అంటోంది డైరెక్టర్ నందినీ రెడ్డి.
ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ స్టోరీని తాను విజయ్ దేవరకొండను దృష్టిలో ఉంచుకుని రాసినట్లు నందిని వెల్లడించింది. ఈ కథ రాసి చాలా ఏళ్లయిందని, అది రాసేటప్పుడు ముందు విజయ్ అయితే లీడ్ రోల్‌కు సరిపోతాడనుకున్నట్లు తెలిపింది. విజయ్ కూడా స్టోరీ విని చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు చెప్పుకొచ్చింది.
అయితే ఈ కథ పట్టాలెక్కేలోపు విజయ్ పెద్ద రేంజ్ కి వెళ్లిపోయాడని, సాఫ్ట్ గా సాగే కుటుంబ కథకు అతను సరిపోడని తర్వాత అనిపించి ప్రత్యామ్నాయం ఆలోచించినట్లు నందినీ వెల్లడించింది. చివరకు నిర్మాత స్వప్న దత్, సంతోష్ అయితే బాగుంటాడని చెప్పిందని, తనక్కూడా అదే అనిపించి స్క్రీన్ టెస్ట్ చేయగా, అతను తన పాత్రకు పర్ఫెక్ట్ గా సూటయ్యాడని నందిని చెప్పింది.
సంతోష్ అనే కాదు ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లకూ నటీనటులు పర్ఫెక్ట్ గా అనిపిస్తారని నందినీ తెలిపింది. తన తర్వాతి సినిమా డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డతో చేయనున్నట్లు నందిని వెల్లడించింది. అలా మొదలైంది దగ్గర్నుంచి సిద్ధు తనకు తెలుసని, మూడు నెలల కిందటే తమ సినిమా ఓకే అయిందని, తమ ఇద్దరి కాంబినేషన్లో ఒక మ్యాడ్ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుందని నందిని తెలిపింది.













