హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న అనిరుధ్?
త్రీ సినిమాతో తన కెరీర్ను స్టార్ట్ చేసిన అనిరుధ్ చాలా తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ సినిమాలు చేసి బాగా ఎదిగాడు. ప్రస్తుతం ఇండియాలో క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎవరైనా అనిరుధ్ పేరే చెప్తారు. స్టార్ హీరోలకున్న క్రేజ్ అనిరుధ్ కు ఉంది. రీసెంట్ గా జైలర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న అనిరుధ్, ఆ సినిమాకు తన పాటలు, బీజీఎంతో ప్రాణం పోశాడు.
అనిరుధ్ ఏ సినిమా ఈవెంట్ కు వెళ్లినా, లైవ్ కాన్సర్ట్ లు చేసినా తనతో పాటూ అక్కడికి వచ్చిన జనం కూడా ఉర్రూతలూగించేలా చేస్తాడు. అంతటి క్రేజ్, ఫాలోయింగ్ అనిరుధ్ త్వరలోనే వెండితెరపైకి నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. కేవలం నటుడిగా కాదండోయ్ ఏకంగా హీరోగానే. అనిరుధ్ క్రేజ్ ను వాడుకుని సినిమా తీయాలని ఓ ప్రొడ్యూసర్ అనుకుంటున్నట్లు కోలీవుడ్ లో వార్తలొస్తున్నాయి.
లోకేష్ కనగరాజ్ దగ్గర యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పనిచేసే అన్బరివు ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, ఈ సినిమాకు కథ స్వయంగా లోకేష్ అందించనున్నాడట. ఓ యాక్షన్ కథతో అనిరుధ్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడని, త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.













