అమితాబ్, అభిషేక్ లకు కరోనా.. ఎవ్వరూ భయపడొద్దన్న అమితాబ్!
కరోనా వైరస్‌కు కనికరం లేదు. వాళ్లు, వీళ్లు అనే తేడా లేదు. ధనిక, పేద అన్న భేదం లేదు. దగ్గరికి వెళితే ఎవరినైనా కబళిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు. అలాగే ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరినీ ముంబైలోని నానావతి హాస్పిటల్లో చేర్పించారు. ఐశ్వర్య, జయా బచ్చన్‌లకు రిపోర్ట్ నెగెటివ్‌గా వచ్చింది. తనకు కరోనా సోకిన విషయాన్ని అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ అని తెలిందని.. అయితే ప్రస్తుతం కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదని.. హస్పిటల్లో జాయిన్ అయ్యానని తెలిపాడు. అమితాబ్ త్వరగా కోలుకోవాలనీ సినీ ప్రముఖుల నుండి రాజకీయ ప్రముఖులు, సామాన్యులు ఇలా అందరూ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు కూడా అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అందులో భాగంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా అమితాబ్ వెంటనే కోలుకోవాలని దేవున్ని ప్రార్ధించాడు. అలాగే అమితాబ్, అభిషేక్ త్వరగా కోలుకోవాలని మహేష్ ట్వీట్ చేశాడు. అక్కినేని నాగార్జున, రవితేజ, దర్శకుడు గుణశేఖర్.. ఇలా టాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ కరోనా నుండి త్వరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా అమితాబ్ నానావతి హాస్పిటల్ నుండి ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో అమితాబ్ మాట్లాడుతూ “ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులకు వైద్య సేవలందిస్తున్న డాక్టర్లకు కృతజ్ఞతలు తలియజేస్తున్నాను. వారు తెల్లకోటు వేసుకున్న దేవుళ్లు. భయం అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ, ఎవ్వరూ భయపడవద్దు. మనం ఈ పరిస్థితుల నుంచి త్వరలోనే బయటపడతాం“ అన్నారు.













