బాలకృష్ణ, బోయపాటి సినిమాలో కీలకమైన క్యారెక్టర్ చేయబోతున్న హీరో ఎవరంటే..?
అల్లరి సినిమాతో హీరోగా పరిచయమై ఆ సినిమా విజయం సాధించడంతో అల్లరిని ఇంటిపేరుగా చేసుకున్న నరేష్ ఆమధ్య వరస కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. ఒకవిధంగా రాజేంద్రప్రసాద్ తరహాలో అన్నిరకాల కామెడీ క్యారెక్టర్స్‌ను చేసేందుకు ప్రయత్నించాడు. 2006 నుంచి 2011 వరకు నరేష్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఒక్కో సంవత్సరం అరడజను తక్కువ కాకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ వచ్చాడు. చివరికి సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేష్‌బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన `మహర్షి`లో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. మరో ఆలోచనకు తావు లేకుండా ఈ సినిమా చేసేశాడు. అతనికి నటుడిగా ఆ సినిమా మంచి పేరే తెచ్చింది. ప్రస్తుతం నాంది అనే ఓ ఎక్స్పెరిమెంటల్ మూవీ చేస్తన్నాడు. కొత్త తరహా కథాంశంతో, డిఫరెంట్ ట్రీట్మెంట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా అతని కెరీర్లో ఓ మైల్స్టోన్ మూవీ అవుతుందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లరి నరేష్ మరో సినిమాలో ఓ కీలక పాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిబి3 అనే వర్కింగ్ టైటిల్‌తో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాలకృష్ణకు, బోయపాటి శ్రీనుకి కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఇటీవలి కాలంలో బోయపాటి చేసిన సినిమాలు కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదు. అలాగే బాలకృష్ణకు కూడా ఈమధ్యకాలంలో సూపర్‌హిట్ లేదు. వీరిద్దరి కాంబినేషన్లో సింహా, లెజెండ్ వంటి భారీ హిట్స్ వచ్చిన నేపథ్యంలో మూడో సినిమాను కూడా అదే రేంజ్లో హిట్ చెయ్యాలని బోయపాటి కృషి చేస్తున్నాడు. కొంత టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఓ వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని. బాలకృష్ణకు అసిస్టెంట్‌గా ఉండే ఓ క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్‌లో చాలా కీలకంగా ఉంటుందట. ఆ క్యారెక్టర్ ద్వారా కొంత ఫన్ కూడా క్రియేట్ అవుతుందట. అందుకే ఆ క్యారెక్టర్‌ను అల్లరి నరేష్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ నరేష్ ఈ సినిమాలో చేయడం ఖాయమని సమాచారం.













