మరో స్టార్ హీరోతో లోకేష్ మూవీ?
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో మంచి విజయాలందుకున్న లోకేష్, ప్రస్తుతం రజినీకాంత్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అజిత్ హీరోగా మరో సినిమా కూడా చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు డిసైడయ్యారట. ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ ను సంప్రదిస్తున్నట్లు టాక్.
మైత్రీ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి లోకేష్ ఇప్పటికే సైన్ చేశాడు. ఇప్పుడు అజిత్- లోకేష్ కాంబోని సెట్ చేయడానికి మైత్రీ నిర్మాతలు సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇది చర్చల దశలోనే ఉంది. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం అది కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రజినీకాంత్ తో సినిమా పూర్తయ్యాకే లోకేష్- అజిత్ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సుంది.













