‘అగధ’ అంటే మూఢనమ్మకం కాదు.. చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి! ఆసక్తి రేపుతున్న ‘అగధ’ ట్రైలర్
‘‘అగధ… అది ఒక మూఢ నమ్మకమయితే కాదు. చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి’’… ఈ ఒక్క డైలాగ్‌తోనే ‘అగధ’ ప్రపంచం ఎంత మిస్టీరియస్‌గా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పేశారు మేకర్స్. మిస్టరీ, దైవిక శక్తులు, అతీంద్రియ అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతున్న ‘అగధ’ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
‘‘మహిమ ఆత్మహత్యకి కారణమేంటో అర్థమైందా బాబాయ్?’’ అనే ప్రశ్నతో మొదలైన మిస్టరీ… ‘‘నువ్వు, మహిమ కలిసి వెళ్లిన చోటేంటి? అక్కడేం చూశారు?’’ అనే మరో ప్రశ్నతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. అసలు మహిమకు ఏం జరిగింది? ఆమె మరణం వెనుక కారణమేంటి? వాళ్లు వెళ్లిన ఆ రహస్య ప్రదేశంలో ఏం చూశారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్కంఠను ట్రైలర్ మొదటి నుంచే క్రియేట్ చేస్తోంది.
‘‘మహిమా… నువ్విక్కడే వున్నావని తెలుసు.. ఏం జరిగిందో చెప్పు’’ అనే డైలాగ్‌తో కథలోని అతీంద్రియ కోణం తెరపైకి వస్తుంది. ఆ వెంటనే ‘‘మంత్ర, తంత్ర విద్యలకు అందని ఆ శక్తి గురించి నాకు తెలియాలి’’ అనే మాట వినిపించడంతో ఇది సాధారణ హారర్ లేదా థ్రిల్లర్ కాదనే విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
అసలు ఆ శక్తి ఏంటి? దానికి ‘అగధ’ అనే పేరు ఎందుకు వచ్చింది? అనే ఆసక్తిని పెంచుతూ… ‘‘అగధ… అది ఒక మూఢ నమ్మకమయితే కాదు. చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి’’ అనే డైలాగ్‌తో అసలు కథలోకి తీసుకెళ్లారు. దీనికి కొనసాగింపుగా ‘‘అగధా… నువ్వీ ప్రపంచాన్ని ఏలాలి.. ముల్లోకాల్నీ శాసించే శక్తివవ్వాలి’’ అనే డైలాగ్ రావడంతో ‘అగధ’ వెనుక ఉన్న శక్తి ఎంత ప్రమాదకరమైనదో అర్థమవుతోంది.
‘‘తన్ను చూశాక నా అంతర్ దృష్టికి అర్థమైంది ఒక్కటే… దాని వక్రబుద్ధి’’ అనే హెచ్చరిక… ‘‘అగధతో పెట్టుకుంది మీ అక్క. దానికి మీ ఇద్దరి తలల్ని కానుకగా ఇస్తా’’ అనే బెదిరింపు… కథలోని సంఘర్షణను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆ శక్తి వెనుక కారణమేంటి? ఆ కుటుంబానికి ‘అగధ’కు ఉన్న సంబంధమేంటి? అనే మిస్టరీని మాత్రం మేకర్స్ ట్రైలర్లో రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డారు.
ఇక ట్రైలర్లో హైలైట్‌గా నిలిచే డైలాగ్స్‌లో ‘‘నీ చుట్టూ చెడుచేసే పిచ్చి భూతాలు వుంటే, నా చుట్టూ సృష్టిని నడిపించే పంచభూతాలు వున్నాయి’’ అనే మాట ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. చెడు శక్తికి ఎదురుగా నిలిచే దైవిక శక్తి ఎంత బలమైనదో తెలియజేసేలా ఉన్న ఈ డైలాగ్ కథలో జరగబోయే భారీ సంఘర్షణకు సంకేతంగా నిలుస్తోంది.
అదే సమయంలో ‘‘ఆ మహదేవి నీ కుటుంబాన్ని ఏదోలా కాపాడ్డానికి ప్రయత్నం చేస్తుంది. కానీ, అగధ వదలదు’’ అనే డైలాగ్ ట్రైలర్‌లోని ఉత్కంఠను మరింత పెంచుతోంది. ఒకవైపు చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన ‘అగధ’… మరోవైపు ఓ కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న మహదేవి… ఈ రెండు శక్తుల మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోందనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది.
అడవులు, పురాతన ఆలయాలు, రహస్య ప్రదేశాలు, మంత్ర తంత్రాలు, అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మిక సంకేతాలతో ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్‌ను మిస్టిక్ వాతావరణంతో నింపారు దర్శకుడు ఎం.ఎస్. రాజు. విజువల్స్‌కు తోడు ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ ‘అగధ’ ప్రపంచాన్ని మరింత ప్రభావవంతంగా చూపించాయి.
హీరో శ్రవణ్ రెడ్డి, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పాత్రలు కథలోని మిస్టరీకి కీలకంగా కనిపిస్తున్నాయి. భయం, ఆందోళన, నిజాన్ని తెలుసుకోవాలనే తపన వంటి భావోద్వేగాలను ఇద్దరూ సహజంగా పలికించారు. ఇతర కీలక పాత్రధారుల ప్రజెన్స్ కూడా ట్రైలర్‌కు అదనపు బలాన్ని తీసుకొచ్చింది.
మిస్టరీ… సస్పెన్స్… థ్రిల్… భక్తి… అతీంద్రియ శక్తులు… వీటన్నింటినీ ఒకే కథలో మేళవిస్తూ దర్శకుడు ఎం.ఎస్. రాజు ‘అగధ’ను మిస్టిక్ డివైన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు. ట్రైలర్లో కథను చెప్పినట్టే చెబుతూ… అసలు రహస్యాన్ని మాత్రం దాచిపెట్టడం విశేషం. ‘అగధ’ ఎవరు? ఆ శక్తి ఎలా పుట్టింది? మహిమకు ఏం జరిగింది? ఆ కుటుంబాన్నే అగధ ఎందుకు వెంటాడుతోంది? మహదేవి వారిని కాపాడగలదా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ‘అగధ’ చిత్రాన్ని అజయ్ కె.ఆర్. సమర్పిస్తున్నారు. ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన ఈ మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ఆగస్టు 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
‘‘చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన అగధ’’కు… ‘‘సృష్టిని నడిపించే పంచభూతాల’’కు మధ్య జరిగే పోరాటం ఎలా ఉండబోతోంది? ఆగస్టు 14న వెండితెరపై ఆ రహస్యం వీడనుంది.








