ఆ సెంటిమెంటే సునీల్‌కు బాగా కలిసొస్తుంది
తంతే వెళ్లి బూరెల బుట్టలో పడ్డట్లు అయింది కమెడియన్ గా ఓ స్టార్ లెవెల్ కు వెళ్లి ,ఆ తర్వాత హీరోగా మారి సక్సెస్ లు అందుకుని, మళ్లీ ఇప్పుడు తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సునీల్ పరిస్థితి. చేతిలో ఆఫర్లున్నా కానీ సునీల్ కు ఇంతకుముందున్న రేంజ్ ఇప్పుడు టాలీవుడ్ లో లేదన్నది వాస్తవం. కానీ తమిళంలో మాత్రం సునీల్ నటనకు ఆడియన్స్, దర్శకనిర్మాతలు బాగా కనెక్ట్ అవుతున్నారు. దానికి కారణం సునీల్ నటించిన సినిమాలన్నీ హిట్లు అవడమే. రీసెంట్ గా మార్క్ ఆంటోనీ హిట్ దిశగా దూసుకెళ్తుంది. టాలీవుడ్ ఆడియన్స్ కు సినిమా పెద్దగా ఎక్కలేదు కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను బాగానే రిసీవ్ చేసుకున్నారు. జైలర్ లో బ్లాస్ట్ మోహన్ గా చిన్న పాత్ర చేసినా క్యారెక్టర్ కీలకమైంది కావడంతో ఇండస్ట్రీ హిట్ మూవీలో పార్ట్ అయ్యాడు సునీల్.
దీని కంటే ముందు శివ కార్తికేయన్ మహావీరుడు సినిమాలో నటించాడు. అది కూడా అక్కడ సక్సెస్ అయిన సినిమానే. ఇక పోతే ప్రస్తుతం సునీల్ చేతిలో జపాన్, బులెట్, ఈగై సినిమాలున్నాయి. డెబ్యూతో మొదలుపెట్టి తమిళంలో సునీల్ చేసిన ప్రతి సినిమా హిట్ అవడంతో అక్కడి వాళ్లు సునీల్‌ని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. పైగా డబ్బింగ్ కూడా సొంతంగా చెప్పడంతో బాగా కనెక్ట్ అవుతున్నారు తమిళ ఆడియన్స్. ఏదేమైనా మన నటుడు వేరే భాషలో దూసుకెళ్తున్నాడంటే అది కూడా ఆనందించదగ్గ విషయమే కదా..













