అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. సంక్షోభంలో ఎంఎస్ఎంఈలు!
అమెరికా – ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాలేదు.. దాని ఆర్థిక ప్రకంపనలు (Economic shockwaves) భారతీయ మార్కెట్లను సైతం తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు’ (MSMEs) ఈ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) కీలక ముందడుగు వేసింది.
ఆర్బీఐకి ఐబీఏ అభ్యర్థన
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో కుదేలవుతున్న ఎంఎస్ఎంఈ (MSMEs) రంగ వ్యాపారులకు తక్షణ ఊరట కల్పించేలా ఒక ప్రత్యేక ప్రతిపాదనను ఐబీఏ తెరపైకి తెచ్చింది. బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యాపార రుణాల (Loans) నెలవారీ వాయిదాల చెల్లింపుల నుంచి వారికి తాత్కాలిక మినహాయింపు (Repayment Moratorium) ఇవ్వాలని కోరుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. వ్యాపారాలు మందగించి, నగదు లభ్యత (Cash flow) లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్న వ్యాపారులను కాపాడుకోవాలంటే ఈ చర్య అత్యవసరమని ఐబీఏ అభిప్రాయపడింది.
‘ఆప్ట్-ఇన్’ మోరటోరియం అంటే ఏంటి?
గతంలో కరోనా సమయంలో ఇచ్చినట్లుగా అందరికీ ఒకేసారి బ్లైండ్‌గా మొరటోరియం ఇవ్వకుండా.. ఈసారి ‘ఆప్ట్-ఇన్’ విధానాన్ని అమలు చేయాలని ఐబీఏ ప్రతిపాదించింది. అంటే యుద్ధ పరిణామాల వల్ల నిజంగానే ఆర్థికంగా దెబ్బతిని, ఈఎంఐలు చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యాపారులు (MSMEs) మాత్రమే స్వచ్ఛందంగా ఈ మోరటోరియం సదుపాయాన్ని ఎంచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ఆర్థికంగా పటిష్టంగా ఉండి, వాయిదాలు చెల్లించగలిగే వారు యథావిధిగా తమ లోన్లు కట్టుకోవచ్చు. దీనివల్ల ఇటు చిన్న వ్యాపారులకు ఆర్థిక ఊరట లభించడంతో పాటు, అటు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై, మొండి బకాయిల (NPAs) పై కూడా ఒకేసారి తీవ్రమైన భారం పడకుండా ఉంటుంది.
చిన్న వ్యాపారులపై యుద్ధం దెబ్బ
ముడిసరుకు, రవాణా ఖర్చులు: పశ్చిమాసియాలో దాడుల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అస్థిరంగా మారాయి. దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి, చిన్న పరిశ్రమలకు (MSMEs) ముడిసరుకు (Raw materials) వ్యయం తడిసి మోపెడైంది.
సరఫరా గొలుసులో అంతరాయం: అమెరికా ఆంక్షలు, హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. ఆర్డర్లు సకాలంలో డెలివరీ కాక పేమెంట్లు ఆగిపోతున్నాయి.
వర్కింగ్ క్యాపిటల్ కొరత: లాభాల మార్జిన్ పడిపోవడం, చేతిలో నగదు నిల్వలు లేకపోవడంతో రోజువారీ వ్యాపార నిర్వహణ (Working Capital) ఎంఎస్ఎంఈలకు (MSMEs) చాలా కష్టంగా మారింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆర్థిక వ్యవస్థకు ఎందుకు ముప్పు?
భారతదేశ జీడీపీలో, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈల (MSMEs) పాత్ర అత్యంత కీలకం. దేశంలోని కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం కుప్పకూలితే, అది నేరుగా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిన్న వ్యాపారులు రుణాలను చెల్లించలేక డిఫాల్ట్ అయితే, ఆటోమేటిక్‌గా బ్యాంకింగ్ రంగంలో నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (NPAs) పెరిగిపోయి బ్యాంకులు ప్రమాదంలో పడతాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి రక్షించేందుకు బ్యాంకులు చేసిన ఈ మోరటోరియం ప్రతిపాదనపై రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే లక్షలాది మంది వ్యాపారులకు ఇది అతిపెద్ద ఊరట కానుంది.
ఇవి కూడా చదవండి








