తిరుమల అభివృద్ధికి ఆరుసూత్రాలు : ముఖ్యమంత్రి చంద్రబాబు
తిరుమల క్షేత్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుతూనే, భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడం, సమాజ సేవను దైవ సేవతో అనుసంధానించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టీటీడీ) కొత్త పుంతలు తొక్కించేందుకు ఒక సమగ్ర, దీర్ఘకాలిక ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. తన తిరుమల పర్యటనలో భాగంగా బ్రహ్మోత్సవాలు తొలిరోజున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసారితో కలిపి 15 సార్లు శ్రీవారికి బాబు పట్టువస్త్రాల సమర్పించినట్లుగా కొత్త రికార్డు నమోదు అయింది. ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు తొలిసారి ప్రమాణం చేశారు. ఆ మరుసటి నెలలోనే ఆయన శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటిసారి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొత్తంగా 7 సార్లు శ్రీవారికి ఆ సమయంలో పట్టు వస్త్రాలు ఆయన బ్రహ్మోత్సవాల వేళ సమర్పించారు. ఇక విభజన ఏపీలో 2014 నుంచి 2019 దాకా అయిదు సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరిగి 2024లో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీంతో వరుసగా మూడు సార్లు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో 15 సార్లు పూర్తి అయింది. మరో రెండేళ్ల పాటు ఈ టెర్ములోనే బాబు స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు కాబట్టి ఆ సంఖ్య 17కి చేరుకుంటుంది అని అంటున్నారు.
తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, టీటీడీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. తిరుమల క్షేత్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక, సేవా కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తితో టీటీడీ కార్యకలాపాలను ఆరు ప్రధాన సూత్రాల ఆధారంగా ముందుకు నడిపించనున్నట్లు తెలిపారు. టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
1. అన్నదానం, 2. ప్రాణదానం, వైద్య సేవలు, 3. శ్రీవారి సేవకులు, 4.విద్యాదానం, 5. దేవాలయాల నిర్మాణం, 6. వృక్షో గోవిందం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై టీటీడికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
భక్తులకు బీమా, ఎలక్ట్రిక్ బస్సులు, మ్యూజియం ఆధునీకరణ, 5 వేల ఆలయాల నిర్మాణం, నెట్‌జీరో విధానం, నీటి సంరక్షణ వంటి పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
తిరుమల కొండల్లో ప్రస్తుతం 89.5 శాతం గ్రీన్ కవర్ ఉందని చంద్రబాబు తెలిపారు. తిరుమలను జీరో వేస్ట్, నెట్‌జీరో విధానాల్లో అభివృద్ధి చేయాల న్నదే లక్ష్యమన్నారు. టీటీడీ భవనాలపై సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు. ప్రస్తుతం టీటీడీ సుమారు కోటి యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, వినియోగం మాత్రం 10 కోట్ల యూనిట్లుగా ఉందని తెలిపారు. సౌర, పవన విద్యుత్ తో పాటు బ్యాటరీ స్టోరేజీపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఉత్పత్తయ్యే వ్యర్థాలను సర్క్యులర్ ఎకానమీలోకి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
తిరుమల.. ఒక హీలింగ్ సెంటర్
2003లో అలిపిరి వద్ద జరిగిన క్లెమోర్ మైన్ల దాడి నుంచి తనను కాపాడింది సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామియేనని, ఇది తనకు పునర్జన్మ అని చంద్రబాబు భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. తిరుమల ఒక రాజకీయ వేదిక కాదని, కష్టాల్లో ఉన్నవారికి, ఒత్తిడికి గురైన వారికి సాంత్వన చేకూర్చే ఒక పవిత్రమైన “హీలింగ్ సెంటర”గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. అందుకే ఇక్కడ రాజకీయాలను నిషేధించామని, భవిష్యత్తులోనూ ఆ పవిత్రతను కాపాడుతామని స్పష్టం చేశారు.
ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ
తిరుమలలో గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియాన్ని ఆధునీకరించి పునఃప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం వంటి అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యేలా మ్యూజియంలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. టీడీఎస్ ట్రస్ట్ రూ.104 కోట్లతో మ్యూజియాన్ని ఏర్పాటు చేసిందని, వచ్చే ఐదేళ్ల పాటు దాని నిర్వహణను అదే ట్రస్టుకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో, 4 అంతస్తులు, 14 గ్యాలరీలతో 8,000కి పైగా ప్రదర్శనలు, 6,000 పురాతన కళాఖండాలను ఇక్కడ అమర్చారు. 360 డిగ్రీల స్పేషియల్ సౌండ్, హోలోగ్రాఫిక్ సాంకేతికతతో రూపొందించిన ఈ మ్యూజియం నిర్వహణను రాబోయే ఐదేళ్ల పాటు టీసీఎస్ సంస్థే చూసుకుంటుంది.
అమెరికాకు చెందిన కార్య ఫౌండేషన్ సహకారంతో వీక్యూసీ-1లో ‘దుర్లభ దర్శనం’ పేరుతో 13 నిమిషాల వీఆర్ (వర్చువల్ రియాలిటీ) ధ్యాన కేంద్రం అందుబాటులోకి తెచ్చామన్నారు.
ప్రతి భక్తుడికి బీమా..
టీటీడీ, ఎలఐసీ కలిసి ప్రతి భక్తుడికీ బీమా కల్పించే విధానాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆధార్ ఆధారిత ఆన్లైన్ బీమా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామని, తిరుమలలో దురదృష్టవశాత్తు భక్తుడు మరణిస్తే రూ.2 లక్షల ఆర్థిక సాయం అందేలా ఈ బీమా ఉండనున్నట్లు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ‘దుర్లభ్ దర్శన’ పేరుతో హీలింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీవారి వైభవం, ఆలయ చరిత్ర, ఇతర ఆధ్యాత్మిక అంశాలను భక్తులకు వివరించేలా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.
తిరుమలలో 44 ఎలక్ట్రిక్ బస్సులు
భక్తుల రాకపోకల కోసం తిరుమలలో మొత్తం 44 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ 25, భారత్ బయోటెక్ 7 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు.
5 వేల ఆలయాల నిర్మాణం..
శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5 వేల దేవాలయాలను నిర్మించాలన్నది తమ ఆలోచనగా చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే ఉన్న పాత ఆలయాలను కూడా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఈ ఆలయాలను శ్రీవారి సేవకులతో అనుసంధానించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు అధికంగా ఉన్న నగరాల్లోనూ శ్రీవారి ఆలయాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. మారిషస్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో శ్రీవారి ఆలయాల ఏర్పాటుపై కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
అన్నదానం, వైద్య సేవలకు మరింత ప్రాధాన్యం..
అన్నదానం ట్రస్ట్ కింద రూ.3,165 కోట్ల కార్పస్ ఉందని చంద్రబాబు తెలిపారు. భక్తులకు అన్నప్రసాదాన్ని మరింత మెరుగ్గా అందించేలా చర్యలు చేపడతామన్నారు.ప్రాణదాన ట్రస్ట్ కింద రూ.191 కోట్లు, బర్డ్స్ కింద రూ.240 కోట్ల కార్పస్ ఉందని తెలిపారు. స్విమ్స్, బర్డ్స్, రుయా, చిన్నపిల్లల ఆస్పత్రి తదితర వైద్య సంస్థలను అనుసంధానించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అనే భావనతో వైద్యులు శ్రీవారి సేవకులుగా మారి సేవలు అందించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.
విద్యా వ్యవస్థలో మార్పులు..
టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించి నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు నైపుణ్యాలు అందించడంతో పాటు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కార్యక్రమాలు చేపడతామ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా రిజిస్టర్ చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు.
ఏడుకొండల నుంచి జాలువారే నీటిని సంరక్షించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. తద్వారా భూగర్భ జలాలను పెంచే కార్యక్రమాలు చేపడతామన్నారు. వృక్ష గోవిందం కార్యక్రమం కింద మెడిసినల్ ప్లాంట్లతో పాటు పలు పర్యావరణ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించి నట్లు తెలిపారు.తిరుమల నీటి అవసరాలను తీర్చేందుకు గతంలో వంద రోజుల్లో కల్యాణి డ్యామ్ నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి నీటిని తరలించిన విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. వచ్చే ఏడాదికి సోమశిల, అనంతరం కందలేరు బాలాజీసాగర్ నుంచి నీటిని తీసుకురావడంతో పాటు కల్యాణి డ్యామ్‌కు కూడా నీటిని తరలించే చర్యలు చేపడతామని తెలిపారు.
తిరుపతిలో స్కైవాక్, మల్టీస్టోరీడ్ పార్కింగ్
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు అనుసంధానించేలా స్కైవాక్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని సీఎం తెలిపారు. కేంద్ర సహకారంతో త్వరలో ఈ ప్రాజెక్టును చేపడతామ న్నారు. ఇటీవల సేకరించిన 50 ఎకరాల్లో మల్టీస్టోరీడ్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సుమారు రూ.230 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు.
తిరుపతిని సర్వీస్ హబ్‌గా అభివృద్ధి
తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు జరగాలని చంద్రబాబు అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో తిరుపతి-తిరుమల ప్రాంతం సర్వీస్ హబ్‌గా మారేలా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తిరుమలతో పాటు తిరుపతిలోనూ శ్రీవారి బ్రహ్మోత్స వాలు నిర్వహించాలన్న ఆలోచన ఉందన్నారు. తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలన్న ఆలోచనను కూడా వెల్లడించారు.
నెట్‌జీరో తిరుమలే లక్ష్యం..
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో నెట్‌జీరో కాన్సెప్ట్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించాలన్నది లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ప్రతి టీటీడీ భవనంపైనా సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ తిరుమలను జీరో వేస్ట్ విధానంలో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించడంతో పాటు భక్తుల భాగస్వామ్యంతో తిరుమల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మొత్తం ఆరు కార్యక్రమాలను చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు.








