కరోనాపై పోరాటంలో తాము సైతం అంటున్న జీ నెట్వర్క్..
వినోద చానెల్స్ కేవలం వినోదాన్ని అందించడం కోసం మాత్రమే కాదని అవసరమైనప్పుడు తాము సైతం అంటూ సమాజ హితం కోసం పనిచేయడానికి కూడా ముందుంటామనిని నిరూపిస్తున్నాయి పలు ప్రైవేట్ టీవీ చానెళ్లు. దేశవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగును అందించే జీ ఎంటర్టైన్మెంట్ సంఘీభావం ప్రకటించింది. ఈ విషయంలో తమ వంతు సహకరించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా 200య అంబులెన్స్‌లను విరాళంగా అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా 40వేల పిపిఇ కిట్స్, 100 పోర్టబుల్ ఐసియులు, 6లక్షళ మంది వలస కూలీల కోసం భోజనాలు అందిస్తామని జీ నెట్వర్క్ ప్రతినిధులు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న హైదరాబాద్, నోయిడా, ముంబయి, చండీఘడ్, జైపూర్, కోల్‌కతా, భువనేశ్వర్, బెంగుళూర్, కొచ్చి, చెన్నైలకు వీటిని అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4వేల పిపిఇ కిట్స్ అదే విధంగా 16 అంబులెన్స్‌లను తెలంగాణకు సమకూర్చనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు జీ ప్రతినిధులు సోమవారం ఓ అంగీకార పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జీ ప్రయత్నాన్ని అభినందిస్తూ మంత్రి కెటీయార్ ట్వీట్ చేశారు.













