తెలంగాణలో వైఎస్ షర్మిల పోటీ.. ఆ నియోజకవర్గం నుంచే
వచ్చే అసెంబ్లీ ఎన్నికలో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిల బరిలోకి దిగబోతున్నారని పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు తెలిపారు. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తున్నందున ఈ నెల 19న నెలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా పాలేరు నియోజకవర్గం అది నుంచి కాంగ్రెస్కు పట్టున్న స్థానం. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం నాయకులదే ఆధిపత్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. గిరిజన ఓటు బ్యాంకు అధికంగా ఉండడం, ఆయా గ్రామ రాజకీయాలు రెడ్డి సామాజికవర్గం నేతల చేతిలో ఉండడం, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండడం, రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం కాంగ్రెస్కు బలమైన నాయకుడు లేకపోవడం లాంటి అంశాలు తమకు కలిసొస్తాయన్న ఉద్దేశంతో షర్మిల పాలేరు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.













