119 స్థానాల్లో వైయస్సార్టీపీ పోటీ.. పాలేరు నుంచి బరిలో దిగనున్న షర్మిల!
వైయస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైయస్సార్టీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తను పాలేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మరో స్థానం నుంచి పోటీచేయాలని డిమాండ్ చేస్తున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. తనతోపాటు భర్త అనిల్, తల్లి విజయమ్మలను కూడా ఎన్నికల్లో పోటీ చేయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అవసరమైతే వాళ్లు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని భావించామని, అందుకే వారితో సంప్రదింపులు జరిపామని అన్నారు. కానీ నాలుగు నెలలు ఎదురు చూసినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సొంతంగానే ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలియజేశారు. పార్టీ నేతలు బీఫామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.













