ప్రజల కోసం త్యాగం చేసాం తప్పా.. ఇది మోసం కాదు
నాతో నడిచిన వాళ్లే నావళ్లని, మళ్లీ చెబుతున్నా నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. ఆ పార్టీ నేతలు కొందరు మూకుమ్మడిగా రాజీనామా చేయడంపై ఆమె స్పందించారు. తెలంగాణ పార్టీ పెట్టిన కారణం తెలంగాణ ప్రజలను కేసీఆర్ వాగ్దానాలు ఇచ్చి మోసం చేస్తున్నారని, కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా తాను పార్టీ పెట్టానన్నారు. ఎన్నో నిరాహార దీక్షలు, ధర్నాలు చేశామని, 3800 కి.మీ. పాదయాత్ర చేశానని తెలిపారు. ఇవన్నీ కేసీఆర్ నియంత పాలనను అంతం చేయడానికేనని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు కేసీఆర్ని గద్దె దించే అవకాశం వచ్చిందని అది మనకు కాకుండా మరో పార్టీకి ఆ అవకాశం వచ్చిందన్నారు. అలాంటప్పుడు మనం ఆ పార్టీని బలోపేతం చేద్దామా? లేక మనం పోటీకి దిగి ఓట్లు చీల్చి మళ్ళీ కేసీఆర్ను గద్దెనెక్కిద్దమా? మనకు స్వార్థ రాజకీయాలే ముఖ్యమా? తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమా? అని వెల్లడించారు. ఇన్నాళ్లు నాతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఆలోచన చేయాలని ఆమె కోరారు. ప్రజల కోసం త్యాగం చేసాం తప్పా, ఇది మోసం కాదన్నారు.













