అదే రోజున పార్టీ ప్రకటన.. అక్కడి నుంచే పాదయాత్ర
కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిలా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల అభిమానులతో ఆత్మీయ సమావేశాలు ప్రారంభించారు. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న జిల్లాల సమావేశాలను హైదరాబాద్లోనే నిర్వహించనున్నారు. దూరంగా ఉన్న జిల్లాలకు మాత్రమే షర్మిలా స్వయంగా వెళ్లి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటిగా ఆమె ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. ఈ జిల్లా ఆత్మీయ సమావేశాలను ఏప్రిల్ 10వ తేదీలోపు ముగించుకొని ఆ రోజున చేవేళ్లలో బహిరంగ సభ పెట్టి పార్టీ పేరు, జెండాను ఆమె ప్రకటించనున్నారు. ఏప్రిల్ 10వ తేదీ వైఎస్ఆర్ కుటుంబీకులకు, ఆయన మద్దతుదారులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజునే ఆయన చెవేళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున గెలిచి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏప్రిల్ 10వ తేదీ నాటికి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 18 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా షర్మిలా కూడా అదే రోజున పార్టీ పేరు ప్రకటించి అక్కడ నుంచే పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు.













