చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చా. వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారు. మా కుటుంబంలో వివాహాలకు చంద్రబాబును వైఎస్ఆర్ పిలిచారు. క్రిస్మస్ సందర్భంగా లోకేశ్‌కు స్వీట్లు పంపాను. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు. కేటీఆర్, కవిత, హరీశ్‌రావుకు కూడా స్వీట్లు పంపాం. రాజకీయం అనేది మా జీవితం కాదు. అది మా వృత్తి. ప్రజా పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటాం. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టం. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని వైఎస్ఆర్ కోరుకునేవారు. రాహల్ ప్రధాని అయితేనే మతకలహాలు తగ్గుతాయి అని తెలిపారు.













