తెలంగాణ భూములన్నీ కాజేస్తున్న కేసీఆర్ సర్కారు.. మండిపడిన షర్మిల
వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించారు. సర్కారు భూములను కేసీఆర్ సర్కారు దోచుకుంటోందని ఆమె ఆరోపించారు. కమీషన్ల పేరు చెప్పి ఖజానాకు తుప్పు పట్టించిన ఈ దొర.. సర్కారీ భూములను కూడా వదలడంలేదని మండిపడ్డారు. ఏదో ఒక పేరు చెప్పి కారు చౌకకే భూములు కాజేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ‘భారత్ భవన్ అంటూ 15 అంతస్తుల బిల్డింగ్ అన్నాడు. ఎక్సలెన్స్ సెంటర్ కూడా పెడుతున్నాడట. అసలు ఒక రాష్ట్రంలో ఒకే రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలు ఎక్కడైనా ఉంటాయా?’ అని ఆమె ప్రశ్నించారు.
“పార్టీ పేరు మార్చేసి కొత్త భవనానికి సర్కారు భూమి తీసుకోవడం ఏంటి? అది కూడా రూ.550 కోట్లు పలికే 11 ఎకరాల స్థలాన్ని కేవలం రూ.37 కోట్లకే కొట్టేయడం దారుణం. దొర రాజకీయాలకు ఇంత తక్కువ ధరకే దొరికే సర్కారీ భూములు.. పేదల సంక్షేమానికి మాత్రం అసలు దొరకవు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూములు ఉండవు. 36 లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడానికి భూములు దొరకవు. అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు, గురుకులాలకు భూములు ఉండవు. చివరికి జర్నలిస్టులకు ఇస్తానన్న స్థలాలు కూడా దొరకవు. కానీ కొత్త పార్టీ భవనానికి మాత్రం కారుచౌకగా స్థలం దొరుకుతుంది’’ అని షర్మిల మండిపడ్డారు.
‘‘దొర విలాసాలకు, పార్టీ కార్యాలయాలకు, ఎక్సలెన్స్ సెంటర్ల కోసం మాత్రం.. అలా అడగ్గానే భూములు దొరుకుతున్నాయి. రాత్రికి రాత్రే దొంగ జీవోలు, బదలాయింపులు జరిగిపోతున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని దొర ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నాడు” అంటూ షర్మిల విమర్శల వర్షం కురిపించారు.













