దీక్ష విరమించిన వైఎస్ షర్మిల
తెలంగాణ నిరుద్యోగులకు సంఘీభావంగా చేపట్టిన 72 గంటల ఉద్యోగ దీక్షను వైఎస్ షర్మిల ఆదివారం విరమించారు. నిరుద్యోగ, అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను సీఎం కేసీఆర్ బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తాను దీక్ష ఎందుకు చేస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. దీక్ష విరమించినా, పోరాటం మాత్రం కొనసాగుతుందని, నోటిఫికేషన్లు వచ్చే వరకూ ప్రతి జిల్లాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. ఏడేళ్ల వరకూ వయస్సును పెంచాలని, నోటిఫికేషన్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని షర్మిల కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ వైఎస్ షర్మిల రెండు రోజుల కిందట ఇందిరా పార్క్ వద్ద దీక్ష ప్రారంభించారు. అయితే సాయంత్రం 5 గంటల వరకే అనుమతి లభించింది. తాను మూడు రోజుల పాటు దీక్ష కొనసాగిస్తానని ఆమె సంచలన ప్రకటన చేశారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె ఇందిరా పార్క్ నుంచి లోటస్‌పాండ్ వరకూ పాదయాత్రగా బయల్దేరారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తదనంతరం లోటస్‌పాండ్‌కు తరలించారు. అయినా షర్మిల ఎక్కడా వెనక్కి తగ్గకుండా లోటస్‌పాండ్‌లోనే దీక్షను కొనసాగించారు. అయితే లోటస్ పాండ్‌లో దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం కాస్త క్షీణించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవెల్స్ 88 నుంచి 62 కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గారని వైద్యులు పేర్కొన్నారు.













