సాహితీవేత్త ఎండ్లూరి సుధాకర్ ఇక లేరు
ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ (63) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ గోపన్‌పల్లిలోని స్వగృహంలో నివసిస్తున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సుధాకర్‌కు ఇద్దరు కూతుళ్లు మానస, మనోజ్ఞ. ఆయన భార్య డాక్టర్ పుట్ల హేమలత రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనతోనే ఉన్నారు. కరోనా వచ్చి తాను కూడా తమ హేమ వద్దకు వెళ్లిపోతే బాగుండునని సన్నిహితుల వద్ద తరచూ ఆవేదన వ్యక్తం చేసేవారు. తారాన్వేషణ అనే కవితలో తన మనోవేదనను వ్యక్తీకరించారు. ఏదో ఒక క్రిస్మస్ రాత్రి మన ఇంటి గుమ్మం ముందు దేవాధారిత ధ్రువతారలా ఉదయిస్తావు అంటూ ఆమెను స్మరించుకున్నారు. ఈ కవితను తన స్నేహితులతోనూ పంచుకున్నారు. నారాయణగూడలోని సిమెట్రీలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.













