యశస్వినిరెడ్డి సంచలన విజయం… ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి
తెలంగాణ ఎన్నికల్లో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా బరిలో నిలిచి విజేతగా నిలిచారు. తన సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆమె ఓడించి సంచలనం సృష్టించారు. 2018లో బీటెక్ పూర్తి చేసిన ఆమె.. వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో పనిచేశారు. వాస్తవానికి పాలకుర్తి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తొలుత వేరే అభ్యర్థిని ప్రకటించింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విదేశాల నుంచి వచ్చిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తు ముందుకు కదలకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆమె తన స్థానంలో కోడలు యశస్వినికి అవకాశమివ్వాలని కోరడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించి ఆమెకు టికెట్ ఇచ్చింది. దయాకరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి యశశ్వినిరెడ్డి 46,402ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి మెజారిటీతో యశస్విని రెడ్డి సత్తా చాటారు. 46,402 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి అభ్యర్థి మామిడాల యశశ్విని రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు 40 ఏళ్ల రాజకీయ చరిత్రకు పాలకుర్తి ప్రజలు స్వస్తి పలికారని అన్నారు.













