యాదాద్రి కి తుది మెరుగులు : దాదాపు పునర్నిర్మాణ పనులు పూర్తి
పనులు 99% పూర్తి
780 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వ్యయమే
దేవాలయ నిధులు అణాపైసా తీసుకోలే
వైడీటీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు వెల్లడి
అద్భుత కళాఖండాలు, అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం, కండ్లు చెదిరే కట్టడాలు.. ఇలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు 99 శాతం పూర్తయ్యాయి. నాలుగేండ్ల కిందట ప్రారంభమైన పనులు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. ఇక తుదిమెరుగులే మిగిలాయని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు తెలిపారు. స్వామివారి ప్రధానాలయం, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూకాంప్లెక్స్, శివాలయం, విష్ణు పుష్కరిణి, సత్యానారాయణ వ్రత మండపం, గిరి ప్రదక్షిణం, నాలుగు దిక్కులా రోడ్లు, టెంపుల్ సిటీ దాదాపు పూర్తికావొచ్చాయని వెల్లడించారు. వీఐపీల విడిది కోసం నిర్మించే ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. మంగళవారం ఆలయ పురోగతి పనులను ఆయన మీడియాకు స్వయంగా చూపించారు.
అనంతరం హరితహోటల్లో కిషన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు రూ.780 కోట్లతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టామని, ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని తెలిపారు. దేవాలయ ఖజానా నుంచి అణాపైసా తీసుకోలేదని స్పష్టంచేశారు. స్వామివారి ప్రధానాలయ నిర్మాణానికి రూ.270 కోట్ల వరకు వెచ్చించామని చెప్పారు. దేవాలయం చుట్టూ 1,900 ఎకరాల భూమి కొని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. టెంపుల్ సిటీ, దేవాలయం చుట్టూ రింగురోడ్డు, గండి చెరువు, రాయగిరి నుంచి దేవాలయానికి నాలుగువరుసల రోడ్డు, వీఐపీ విడిది భవనాల నిర్మాణం చేపట్టామని వివరించారు. టెంపుల్ సిటీ ప్రాంతంలో కాటేజీల నిర్మాణానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు దాతల నుంచి విరాళాలు సేకరించలేదని చెప్పారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేలా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో ఆలయ ఈవో గీత, వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, స్థపతి సలహాదారు డాక్టర్ ఆనందచార్యుల వేలు, కళా దర్శకుడు ఆనందసాయి పాల్గొన్నారు.













