పది రోజులు తెలుగు సంబురాలు : కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మహాసభలను వారం, పది రోజుల పాటు నిర్వహించాలని సూచించారు. తెలుగు భాష- సాహిత్యాభివృద్ధి, వాప్తికి తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్యంలో కృషిచేసిన వారందరినీ ఆహ్వానించి, గౌరవించాలని సూచించారు. తెలుగు భాషాభివృద్ధికి సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులు విశేష కృషి చేశారు. సాహిత్యంలో అద్భుత ప్రతిభ చూపారు. ఎందరో కవులు, రచయితలు తమ కవితల, రచనలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ ప్రముఖులు రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలు ముద్రించాలి. కార్యక్రమానికి హాజరయ్యే తెలుగు పండితులకు ఆన్‌డ్యూటీగా పరిగణించి, ప్రారంభసభకు వచ్చేందుకు రవాణా ఖర్చులను ప్రభుత్వవే భరించాలి అని కేసీఆర్ ఆదేశించారు.













