సింగపూర్‌లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్
ప్రపంచం నలువైపులా ఉంటున్న తెలంగాణ ఐటీ నిపుణులను ఒకే వేదికపై చేర్చడం ద్వారా తెలంగాణలో పెట్టుబడులు, నూతన టెక్నాలజీలకు ప్రోత్సాహం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీహబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) సంయుక్తంగా నిర్వహించే వరల్డ్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ లోగోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగపూర్‌లో నిర్వహించే మొదటి వరల్డ్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో తెలుగు టెకీలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తల మాట్లాడుతూ వచ్చే ఏడాది సింగపూర్‌లో వరల్డ్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదటి సదస్సు నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి రెండేళ్లకు ఒక దేశంలో ఇదే తరహా సదస్సులు ఏర్పాటు చేసి, టెకీలందరినీ ఒకే వేదికపై తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.













