24 గంటలు 507 చిత్రాలు గీసిన ఆర్టిస్ట్
పెన్సిల్‌ను కుంచెగా మలిచి 24 గంటలపాటు ఏకధాటిగా అద్భుతమైన చిత్రాలను గీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు ఈ కళాకారుడు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా శనివారం ఉదయం 11:15 గంటలకు ప్రారంభమైన ఆర్టిస్ట్ హర్ష చిత్రలేఖనం ఆదివారం ఉదయం 11:15 గంటలవరకు కొనసాగింది. 12 పెన్సిళ్లతో 507 బొమ్మలను గీసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ హరికుమార్, సౌత్ ఇన్చార్జి కృష్ణారెడ్డి ఆర్టిస్ట్ హర్షకు అందజేశారు. 24 గంటలపాటు ఆర్టిస్ట్ హర్ష వేస్తున్న చిత్రాలను నిరంతరాయంగా వీడియో తీశారు. ఆ వీడియోను ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలకు పంపించగా, మరో 40 రోజుల్లో కళాకారుడు హర్ష కల నేరవేరనున్నది. ఈ సందర్భంగా ఆర్టిస్ట్ హర్ష మాట్లాడుతూ ప్రయత్నిస్తే ఎవరికైనా రికార్డులు వస్తాయన్నారు. ఎందరో పేద కళాకారులు టాలెంట్ ఉన్నా రోడ్డుపై చిత్రాలు వేస్తూ తమను గుర్తించే వారు లేక మరుగున పడిపోతున్నారని, అలాంటివారిని ప్రోత్సహిస్తానని చెప్పారు. తన రికార్డు తానే బ్రేక్ చేసుందుకు త్వరలో మరో ఫీట్ చేస్తానన్నారు.













