మేయర్ పీఠం టీఆర్ఎస్ దేనా?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. దీంతో మేయర్ పీఠానికి కావాల్సిన మెజారిటీ లేక అన్నీ పార్టీలు ఇప్పుడు పొత్తు పెట్టుకుని మేయర్ పదవిని దక్కించుకుంటాయా లేదా అన్నది చూడాల్సిందే. అధికార టీఆర్ఎస్కే మేయర్ పీఠం అని, ఇప్పటికే ఆ పార్టీ మేయర్ పదవికి తగిన అభ్యర్థిని కూడా ఎంపిక చేసిందని వార్తలు వినవస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. టీఆర్ఎస్-బీజేపీ, ఎంఐఎం-బీజేపీ పొత్తు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని అధిరోహించాలంటే ఎంఐంఎం మద్దతు తప్పని సరి. అయితే నిన్నటి వరకు తమకు ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ ప్రచారం చేసుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఖచ్చితంగా పతంగి పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో ఎంఐఎం, టీఆర్ఎస్కు మద్దతిస్తుందా.. లేదా.. ఒకవేళ ఇచ్చినా.. ఎలాంటి షరతులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఏకంగా మేయర్ కుర్చీ తమకు ఇవ్వాలని అడిగే ఛాన్స్ ఉందని ప్రచారం. డిప్యూటీ మేయర్‌తో సరిపెట్టుకోవాలని టీఆర్ఎస్ బేరసారాలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతల మధ్య అంగీకారం కుదిరితేనే హంగ్‌తో బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. గతంలో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐంఎంతో కలిసి అధికారంలోకి వచ్చింది.













