పివి సేవలు శ్లాఘనీయం…కవిత
పీవికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం
తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకి దేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్న ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో సమాలోచన సభ నిర్వహించారు. తెలంగాణ తేజం మన పీవీ (సాహితీ సౌరభం – అసమాన దార్శనికత) పేరుతో, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కవిత అధ్యక్షతన సమాలోచన సభ జరిగింది. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, సీనియర్ జర్నలిస్ట్, రచయిత కల్లూరి భాస్కరం, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మహేష్ బిగాల హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ.. దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా పీవీ ప్రధాని పదవి చేపట్టారన్నారు. పీవీ సేవలను యువతరానికి తెలియజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ జాగ•తి నాయకులకు కవిత పిలుపునిచ్చారు. పీవీ మేధస్సును, సాహిత్యాన్ని యువతరానికి చేరేలా తెలంగాణ జాగృతి, ప్రతినెలా రెండు కార్యక్రమాలు నిర్వహించనుందని మాజీ ఎంపీ ప్రకటించారు. ‘పీవీ బుక్ క్లబ్’ పేరుతో, ప్రాచీన పుస్తకం, నవీన పుస్తకం పేరుతో ప్రతి నెలా రెండు కార్యక్రమాలు నిర్వహించి, పీవీకి అక్షర నివాళి అందిస్తున్నామన్నారు. పీవీ తన మేధస్సును దేశం కోసం ఉపయోగించారని ఆమె పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం పొగిడేంత, హుందాతనంతో పీవీ వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. పివీ నరసింహరావు ఆర్థిక సంస్కరణలవేత్తగానే కాకుండా, పోఖ్రాన్ అణుబాంబు పరిక్షలు చేయాలన్న నిర్ణయం తీసుకున్న వ్యక్తి అని, పీవీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ ప్రధాని వాజ్పేయి స్వయంగా చెప్పారని కవిత గుర్తు చేశారు. పీవికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని ఈమేరకు తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు.
టీఆర్ఎస్ ఎన్నారై కన్వీనర్ మహేష్ బిగాల మాట్లాడుతూ పీవి శతజయంతి ఉత్సవాలను దాదాపు 51 దేశాల్లో నిర్వహిస్తున్నామని, దాంతోపాటు వివిధ దేశాల్లో పీవీ నరసింహరావు విగ్రహాలను కూడా ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. అమెరికా, సౌతాఫ్రికా, యుకె, సింగపూర్, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో పీవి నరసింహరావు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు తాము కూడా పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ముందుకు వస్తున్నారని, మారిషస్ రాష్ట్రంలోని తెలుగువాళ్ళయితే తాము ఈ వేడుకలను మూడురోజులపాటు చేస్తామని మీరంతా తప్పకుండా రావాలని ఆహ్వానించారని, వారి అభిమానాన్ని చూస్తుంటే పీవికి వివిధ దేశాల్లో ఉన్న ఆదరణ ఏమిటో తెలుస్తోందని చెప్పారు. పీవీ చేపట్టిన సంస్కరణల వల్లే నేడు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ప్రపంచంలోని వివిధ నగరాల్లో పోటీపడేలా ఎదిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, రచయిత కల్లూరి భాస్కరం కూడా మాట్లాడూతూ పీవిగారి గొప్పదనాన్ని తెలియజేశారు.













