ఆన్ లైన్ మీడియా పాలసీ త్వరలో – దిలీప్ కొణతం
తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ మీడియాను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలను తీసుకుంటుందని తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం ప్రకటించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆన్ లైన్ మీడియా – సామాజిక బాధ్యత అనే అంశం పై నిర్వహించిన సెమినార్ లో ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటించారు. కానీ అదే సమయం లో ఆన్ లైన్ మీడియా తన సామాజిక బాధ్యతలను గుర్తెరిగి భావ ప్రకటన స్వేచ్స ను దుర్వినియోగపరచ వద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రెస్ అకాడెమీ మరియు ఐ అండ్ పిఆర్ ల సమన్వయముతో ఆన్ లైన్ మీడియా గుర్తింపు కై విధి విధానాలు రూపొందిస్తామని ప్రకటించారు.
మన తెలంగాణా ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాతో పోల్చితే ఆన్ లైన్ మీడియా కు సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుందని అన్నారు. అలాగే భావ ప్రకటన స్వేచ్స ఉందని హద్దులు మీరితే ప్రభుత్వం కూడా ఆ వ్యక్తుల పై చర్యలు తీసుకోడానికి చట్టాలను ఉపయోగించ వచ్చు, కానీ ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తే అప్రజాస్వామికం అవుతుంది అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్స్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియా ను సామాజిక మాధ్యమాలతో విడిదీసి చూడలేమని, ఎందుకంటే వేగం మరియు నియంత్రణ లేకపోవడం కారణాల వలన తప్పులు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
తెలంగాణా టుడే ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియా సోషల్ మీడియాలు పరస్పర ఆధార పడి నడుస్తున్నందున, వాటిని వేరు వేరుగా చూడలేమని అభిప్రాయపడ్డారు.
హిందూ బిజినెస్ లైన్ డిప్యూటీ ఎడిటర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియాకు , సోషల్ మీడియాకు బాధ్యత పరంగా చాలా వ్యత్యాసం ఉందని , వ్యక్తి గత అభిప్రాయాలు తెలపడానికి సోషల్ మీడియా ఉపయోగపడితే , ఆన్ లైన్ మీడియాలో ఆ స్వేచ్స చాలా పరిమితంగా ఉంటుందని, సామాజిక బాధ్యత కలిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు . ఏది ఏమైనప్పటికీ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన అవసరం ఏర్పడిందని , రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా ఆన్ లైన్ మీడియా దే అని అన్నారు .
తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తి రెడ్డి మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియాకు సామాజిక బాధ్యత ఉంటుందని, నిజాయితీగా వార్తలు పెడితే ప్రజాదరణ వస్తుందని, అదే గుర్తింపునకు గీటు రాయి అవుతుందని అన్నారు.
నమస్తే తెలంగాణా డిప్యూటీ ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ మధ్య కాలం లో ఆన్ లైన్ మీడియాకు ప్రాధాన్యత పెరుగుతున్నందున మాలాంటి మధ్య తరం జర్నలిస్టు లకి డిజిటల్ మీడియా కు మారాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది .
తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అయులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఆన్ లైన్ మీడియాకు గుర్తింపు ఇవ్వాలని , వాటిని ప్రోచ్సహించడానికి ప్రకటనలతో పాటు, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు ఇవ్వాలని కోరారు .
అలాగే తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ధర్మాసనం మాట్లాడుతూ ఆన్ లైన్ మీడియాకు గత సంవత్సరం దేశం లో నే మొదటిసారిగా ఇఛ్చిన గుర్తింపుని రద్దు చేయడం బాధాకరమని , దానిని పునరుద్దరించారాలని కోరారు .
వీరితో పాటు తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులైన రాజగోపాల్, హనుమంత రావు, కళ్యాణం శ్రీనివాస్, సదానందం, నరసింహరావు, యూ. శ్రీనివాస్, రాకేష్, వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.













