బీఆర్ఎస్ లో చేరిన నాగం, విష్ణువర్దన్ రెడ్డి
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగం, విష్ణువర్ధన్ రెడ్డి తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తన మిత్రుడు నాగం జనార్దన్ రెడ్డి, యువనేత విష్ణువర్ధన్ రెడ్డికి హృదయపూర్వకంగా బీఆర్ఎస్లోకి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. నాగం జనార్దన్‌రెడ్డి 1969 ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు. పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికితే నాగం అంగీకరించారని తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్‌లోని సామాన్య ప్రజల కోసం పోరాడిన నాయకుడు పి. జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) అని అన్నారు. ఆయన వ్యక్తిగతంగా తనకు మిత్రుడని తెలిపారు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీలో చేరడం సంతోషమన్నారు. నాగం, విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్ తన బాధ్యతని అన్నారు.













