భైంసా అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరా
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చెలరేగిన ఘర్షణలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరా తీశారు. కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఈ విషయంపై ఫోన్ చేసి ఆరా తీశారు. సంఘటన వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై షా అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి కప్పుడు సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా షా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ విషయంపై పురపాలక శాఖా మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను తమ ప్రభుత్వం అస్సలు సహించదని స్పష్టం చేశారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీలను కేటీఆర్ కోరారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి అల్లర్లు జరిగాయి. జుల్ఫికర్ కాలనీలో చోటుచేసుకున్న చిన్న వివాదం… ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. వాహనాల సైలెన్సర్లను తీసేసి, కొందరు యువకులు చక్కర్లు కొట్టారు. దీంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. రాళ్లు రువ్వుకున్నారు. కవరేజ్‌కి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా దాడులు చేశారు. ఈ అల్లర్లలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.













